ఈ రోజు అమరావతి పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు పై, వైసీపీ సానుభూతిపరులు రాళ్ళ దాడి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం, మాకు సంబంధం లేదని చెప్తుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి, రాజధాని పర్యటనలో టెన్షన్ నేపధ్యంలో, డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి కేసులో, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. చెప్పులు విసిరిన వ్యక్తిని రైతుగాను, రాళ్ళు విసిరిన వ్యక్తీని, ఒక రియల్టర్‌గా గుర్తించామని చెప్పారు. చంద్రబాబు వల్ల తాము ఇబ్బంది పడ్డామని, వారు చెప్పారని, గౌతం సవాంగ్ అన్నారు. ప్రతి ఒక్కరికి, నిరసన తెలిపే హక్కు ఉంటుంది గౌతం సవాంగ్ చెప్పారు. ఇలాంటి పర్యటనల్లో, పోలీసులను తప్పుబట్టటం సహజం అని అన్నారు. చంద్రబాబు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని మా విచారణలో తేలింది కాబట్టే పర్మిషన్ ఇచ్చామని సవాంగ్ అన్నారు.
అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు పై రాళ్ళ దాడి జరిగితే, ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దం పగిలితే, రాష్ట్ర డీజీపీగా ఉండే వ్యక్తీ, అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పటం, అలాగే చంద్రబాబు వల్లే మాకు ఇబ్బంది, అందుకే దాడి చేసాం అని వారు చెప్పారని, డీజీపీ చెప్పటంతో, తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. డీజీపీ ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వాలి కాని, ఇలా సింపుల్ గా, ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉందని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని టిడిపి నేతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో, చంద్రబాబు కూడా డీజీపీ వ్యాఖ్యల పై స్పందించారు. ఇన్నేళ్ళలో, ఎన్నో సార్లు ప్రజల తరుపున పోరాటం చేసామని, ఎప్పుడూ ఇలా దాడి జరగలేదని అన్నారు.
నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంది, మేము ఆమోదించామని ఏపీ డీజీపీ అన్నారని, రేపు జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తే, తాము కూడా నిరసన తెలుపుతామంటే, డీజీపీ గారు పర్మిషన్ ఇస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. నా కాన్వాయ్ వస్తూ వుంటే వాళ్లొచ్చి రాళ్లు వేస్తూ వుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా? అదేమంటే నిరసన తెలిపే హక్కు ఉందంటారా ? ఇది ప్రభుత్వ దాడి కాదా? దీని కన్నా నీచం ఏముంది? దాడి చేస్తే మేము భయపడతామా? అని ప్రశ్నించారు. అలాగే బస్సు పై విసిరిన ఒక కర్ర చూపిస్తూ, ఇది పోలీసు లాఠీ, డీజీపీ సమాధానం చెప్పండి, వారికి మా పై విసరమని లాఠీలిచ్చారా అని ప్రశ్నించారు. మా దగ్గరే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొండి అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.