అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికలకు ఎలా వెళ్తారో అందరికీ తెలిసిందే. తమకు అనుకూలమైన అధికారులని ఉన్నత పదవుల్లో పెట్టి, పనులు చక్క దిద్దికుంటారు. ఎన్నికల వేళల్లో ఇబ్బంది లేకుండా, తమ పనులు చేసుకుపోతారు. అయితే, చంద్రబాబు మాత్రం, వీరికి భిన్నం. చంద్రబాబు ఈ సారి పోజిటివ్ ఫీల్ తోనే ఎన్నికలకు వెళ్తున్నారు. తాను చేసిన పనులు, ప్రజలకు సరైన విధంగా చెప్తే చాలని, చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తనకు అనుకూలమైన అధికారులని కాకుండా, ప్రజలకు చేరువగా.. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేరవేయగలిగే జట్టు ఉండాలని ఆయన భావిస్తున్నారు. అధికారులు నిజాయితీగా ఉండడం కీలకం. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ప్రధానమే. ఈ రెండూ ఉన్న జట్టుతో ముందడుగు వేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని భావిస్తున్నారు.
పాలనకు రథచక్రాల్లాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కొందరు ఉన్నతాధికారులు సమర్థంగా వ్యవహరించలేకపోవడం, ఇతరత్రా ఆరోపణలు రావడం ఇటీవల ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అదే సమయంలో మరికొందరు అధికారులు నిక్కచ్చిగా ఉంటున్నా.. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారం ఉంది. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి రావడం.. ప్రభుత్వంపై సంతృప్తి శాతం కొంత తగ్గిపోవడానికి కారణమవుతోందని అంటున్నారు. ఎన్నికలకు దాదాపు ఎనిమిది నెలల సమయం ఉన్నందున.. ఈ లోపు ప్రజలకు మరింత సేవ చేసేలా ఎన్నికల జట్టు కూర్పు ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో కసరత్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీలు, అర్బన్ ఎస్పీల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశాలున్నాయని సమాచారం. ఉన్నతాధికారుల వ్యవహార శైలి ఆ నోటా ఈ నోటా ప్రజలకు కూడా చేరిపోతోంది. దీంతో వాళ్లు బాగా పనిచేస్తున్నారా లేదా అన్న చర్చ వాళ్లలోనూ నడుస్తోంది. ఈ వివరాలన్నీ సేకరించి.. ఆశించిన మేరకు పనిచేయని వారిని బదిలీలు చేసే అంశంపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మరోవైపు.. ప్రజలతో నిరంతరం సంబంధాలుండాల్సిన కొన్ని శాఖల అధిపతులనూ బదిలీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రజలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన శాఖలమీద కొంత దృష్టిపెట్టారని అంటున్నారు.