ప్రజల అండదండలే తెలుగుదేశానికి పెట్టనికోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఎలక్షన్ మిషన్- 2019 పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహం కదం తొక్కుతోందని, ప్రజల్లో తెదేపా పట్ల సానుకూలత అద్భుతంగా ఉందన్నారు. 37 ఏళ్ల చరిత్రలో ఇంత సానుకూలత ఎప్పుడూ లేదని చెప్పారు. అదే సమయంలో ఏమరపాటుగా ఉండరాదని సూచించారు. తమ ప్రత్యర్థి కరడుగట్టిన నేరస్థుడనేది గుర్తించాలని, నేరగాళ్లతో పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు.
వైకాపాకు ఒక్క అవకాశం ఇస్తే పెను ప్రమాదమని హెచ్చరించారు. భూములు మింగేస్తారు.. ఆస్తులు కబ్జా చేస్తారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులున్న తెదేపా అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా తెరాసా, వైకాపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో జగన్ మేలు కోసమే కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీలో తన డమ్మీని పెట్టాలనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. క్విడ్ ప్రోకో (నీకిది- నాకది) జగన్ పాలసీ అని చంద్రబాబు ఎద్దేవాచేశారు. కేసులు మాఫీ చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా అడగనని నరేంద్ర మోదీతో జగన్ డీల్ చేసుకున్నారని ఆరోపించారు.
అదేవిధంగా ‘కప్పం కడతా- మీ వద్ద నా భూముల స్వాధీనం వద్దు’ అని కేసీఆర్తో ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ కేసుల దర్యాప్తు నత్తనడక మోదీ గిఫ్ట్ అని అన్నారు. ఏపీ తాకట్టు మోదీకి జగన్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని దుయ్యబట్టారు. అందుకే ప్రతి నిమిషం తననే జగన్ నిందిస్తాడని, మోదీని నిలదీయడని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తెదేపాదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ రోజు నుంచి ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నామని తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులంతా సమన్వయంగా పనిచేయాలని సూచించారు.