తన పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ బ్యూకోక్రాట్‌లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారులను బదిలీ చేస్తే.. రిటైర్డ్ ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉన్నమాట అంటే తనపైనే ఫిర్యాదు చేస్తారా? అని అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం మీద కేసులు లేవా? అని సీఎం ప్రశ్నించారు. ఏకపక్షంగా అలాంటి వ్యక్తిని ఎలా సీఎస్‌ను చేస్తారని అన్నారు. ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన సీఎం.. తనపై మాజీ బ్యూరోక్రాట్‌లు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై స్పందించారు. సాయంత్రం ఐదారు గంటల సమయం అంటే పోలింగ్ రోజు ఎంతో కీలకం అని.. అలాంటి సమయంలో మొక్కలు నాటడానికి వెళ్తారా? అని ఫైర్ అయ్యారు.
ఆ సమయంలో డీజీతో సీఎస్ సమావేశం కావాల్సిన అవసరమేంటన్నారు. ఇలా అయితే ఎన్నికలను ఎవరు నమ్ముతారని వ్యాఖ్యానించారు. సీఈసీ అరోరా ఢిల్లీలో కూర్చొని ఫోజులు కొడుతున్నాడంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలను తీసుకెళ్లి.. 24 గంటలు ఇంట్లో పెట్టుకుని తీసుకొచ్చారని సీఎం ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతున్న వారికి మోదీ కాపలాకాశారంటూ నిప్పులుచెరిగారు. ఇప్పుడు దేశానికి కాపలాదారుడినని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇవన్నీ మోదీ ఘోరాతిఘోర వైఫల్యాలుగా పేర్కొన్నారు. 2 వేల నోటు తెచ్చిన మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
‘‘వీవీప్యాట్‌లను లెక్కించమంటే కుదరదంటున్నారు.. వీవీప్యాట్‌లు ఎందుకు పెట్టారు.. అలంకారం కోసమా?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై ఏకపక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్ ఉందా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీవీప్యాట్‌లు లెక్కించమంటే ఎందుకు భయపడుతున్నారని సీఎం ప్రశ్నించారు. మోసం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే భయపడతారని, మోదీ తన బండారం బయటపడుతుందని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ మీద ఇప్పటి వరకు మార్గదర్శకాలు ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు.