50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈవీఎంల పని తీరుపై అనుమానాలున్నాయన్నారు. ఏపీలో మాదిరే అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. బంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. బంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలు పెట్టారన్నారు. ఈవీఎంలపై ఎప్పటినుంచో పోరాడుతూనే ఉన్నామన్నారు. 2019కి వంద శాతం వీవీప్యాట్లు వచ్చాయని పేర్కొన్నారు. చాలా దేశాలు పేపర్ బ్యాలెట్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయన్నారు. 50 వాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోర్టుకు వెళ్లామన్నారు. హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు చేశారని ఆరోపించారు.
యూపీలో ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి పడ్డాయని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్, బెంగాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని తెలిపారు. మేం ఒక్క ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడటంలేదన్నారు. వీవీ ప్యాట్లు లెక్కించేందుకు 6 రోజుల సమయం పడుతుందంటున్నారని.. పేపర్ బ్యాలెట్లే రెండు రోజుల్లో లెక్కించేవారని గుర్తుచేశారు. ఈవీఎంల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పుస్తకం రాశారని... ఇప్పుడు అదే ఈవీఎంలను ఆయన సమర్థిస్తున్నారని మండిపడ్డారు.
తప్పులు ఎత్తి చూపితే కేసులా..? ‘‘ఈవీఎంల సాంకేతిక దృఢత్వంపై బీబీసీ కూడా అనుమానం వ్యక్తంచేసింది. తెలంగాణలో పోల్ అయిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అందుకే మళ్లీ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అనుమానాలున్నాయనే 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలని కోరుతున్నాం. ఎన్నికల సంఘం చెబుతున్న విధానంలో ఎక్కడా విశ్లేషణాత్మక ధోరణి అవలంబించట్లేదు. ఈసీ చేసే తప్పులు గురించి మాట్లాడితే కేసులు పెడతారా? వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ వాదన అసంబద్ధంగా ఉంది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశంపై మరోమారు కోర్టుకు వెళతాం’’ అని చంద్రబాబు స్పష్టంచేశారు.