తెలుగుదేశాన్ని ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సెప్టెంబరు 11న ప్రారంభించిన కార్యక్రమాన్ని 75 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైన చోట 10,15 రోజులు పొడిగిస్తామని తెలిపారు. ఆయన సోమవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇంటింటికీ తెలుగుదేశం కోసం కొత్తగా రూపొందించిన ఐదు పాటలు, ఇదివరకే ప్రాచుర్యం పొందిన పార్టీ గీతాలు మరో మూడు కలిపి సిద్ధం చేసిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ఇక్కడ మన పాట్లేవో మనం పడుతుంటే రాష్ట్రంలోనే ఉండనివాళ్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయిందని, మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని, ఇంతవరకు రాష్ట్రానికే రానివాళ్లు రాజకీయం ఎలా చేస్తారని వైకాపా అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్‌ మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చి వెంటనే వెళ్లిపోయారని విలేకరులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో తెదేపానే శాశ్వతంగా ఉంటుందన్నారు.

60 లక్షల కుటుంబాలను కలిశారు..
ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా పార్టీ నాయకులు 60 లక్షల కుటుంబాలను కలిశారని, 45,79,228 ఇళ్లను జియోట్యాగింగ్‌ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఇలా చేయలేదని, ఇది చరిత్రని వివరించారు. ఇంతవరకు ప్రజల నుంచి 20,90,484 వినతులు వచ్చాయని, వాటిలో 19,18,726 వ్యక్తిగత, 1,71,758 సామాజిక సమస్యలున్నాయని చెప్పారు. అత్యధికంగా పురపాలక శాఖకు సంబంధించి 4.71 లక్షల వినతులు వచ్చాయన్నారు. వాటన్నిటినీ ఆన్‌లైన్‌లో ఎక్కించామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించి నిర్వహణ కోసం 16,723 మందికి శిక్షణనిచ్చామని తెలిపారు. మొత్తం 1.39 కోట్ల కుటుంబాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తామన్నారు. వైకాపా మద్దతుదారుల ఇళ్లకు కూడా వెళతారా? అన్న ప్రశ్నకు అందరూ రాష్ట్ర ప్రజలేనని, అందరి సమస్యలు పరిష్కరించడమే తమ ఉద్దేశమని, 80 శాతం ప్రజలు తెదేపాతో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని బదులిచ్చారు.

ఎవరెలా పనిచేస్తున్నారో తెలుస్తుంది..!
‘ఇంటింటికీ తెలుగుదేశం వల్ల పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ బాధ్యులు, ఇతర నాయకుల్లో ఎవరు ఎలా పనిచేశారో నాకూ తెలుస్తుంది. దాన్ని బట్టి దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెదేపా బలంగా ఉండాలి. అన్ని చోట్లా గెలవాలి. పార్టీ నాయకులు ఇదివరకులా తిరగకుండా తిరిగామని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఇంటికీ వెళ్లి జియోట్యాగింగ్‌ చేయాల్సిందే. అధికారులు, నాయకుల పట్ల ఇదివరకున్న వ్యతిరేక భావన పోయింది. వారంటే గౌరవం పెరిగింది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సర్దుబాట్లు తప్పవు..
పోలవరం గుత్తేదారును మారిస్తే నిధులివ్వబోమని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నట్టు వచ్చిన వార్తల గురించి విలేకరులు ప్రస్తావించగా...‘పోలవరం 2019కి పూర్తి కావాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. గుత్తేదారుకు గిట్టుబాటు కానప్పుడు మనం కొట్టినా పని చేయలేడు. చేస్తున్న పనులకు ఇస్తున్న నిధులు సరిపోవడం లేదు’ అని తెలిపారు. డబ్బుల్లేక మట్టి పనులు కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు ఆకృతులు ఖరారుచేసేందుకు అమెరికా, యూఏఈ, లండన్‌ పర్యటనకు వెళుతున్నట్టు చెప్పారు. తెదేపా బీసీలకు ద్రోహం చేసిందంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన విమర్శలను ప్రస్తావించగా వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా బీసీలను అణగదొక్కారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక కార్యక్రమాలు చేశామని, బీసీలు మొదటినుంచీ తెదేపాకు వెన్నెముకగా నిలిచారని తెలిపారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చామని.. కమిటీని ఏర్పాటుచేశామని, నెలలో మళ్లీ తాను సమీక్షిస్తానని తెలిపారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో ఎప్పుడు చేరుతున్నారన్న ప్రశ్నకు.. చేరినప్పుడు చెబుతామని బదులిచ్చారు. వైకాపా నుంచి ఇంకా ఎవరెవరు వస్తున్నారన్న ప్రశ్నకు ఆ జాబితా గురించి ఆ పార్టీ నాయకుల్నే అడగాలని స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read