జగన్.. ఆయన పేరులోనే ‘గన్’ ఉందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయనకు ఎప్పుడూ నేరాలు, ఘోరాలేనని, ఎప్పుడూ కుట్రలు చేస్తుంటారని ఆరోపించారు. ప్రజలే తనకు పోలీసు అధికారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దుర్మార్గుల ఆటలు సాగనీయబోమని, కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపించేవరకు వదిలిపెట్టబోనన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
కోడికత్తి పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనన్నారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వస్తున్నాయని, ఆ పక్షులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మోదీ, కేసీఆర్ నుంచి డబ్బులు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే జైలుకు.. జనసేనకు ఓటేస్తే అత్తారింటికే పోతారని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకుంటే భవిష్యత్ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఒక్కసారి గెలిపించాలని జగన్ ప్రజలను కోరుతున్నారని.. ఒక్కసారి అని తినే తిండిలో విషం కలుపుకొంటామా? ఒక్కసారి అని కొండ పైకెక్కి లోయలో దూకుతామా? అని ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయమే తన ధ్యేయమని, నిత్యం పేద ప్రజలతోనే ఉంటానని చంద్రబాబు స్పష్టంచేశారు. ఏ ఒక్కరివాడిగా కాకుండా అందరివాడిగా ఉంటానని హామీ ఇచ్చారు. 18 నుంచి 35ఏళ్ల లోపు యువత ఆలోచించి ఓటేయాలని సూచించారు. కోటి మంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్న తానేనన్నారు. పెన్షన్లు పదిరెట్లు పెంచి భరోసా కల్పించానని చెప్పారు. మోదీ మోసం చేసినా, కేసీఆర్ సహకరించకపోయినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలిపేందుకు కృషిచేసినట్టు చెప్పారు. రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయిలు ద్వారా నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సిగ్గులేకుండా పోలవరం తనకు ఏటీఎం అంటున్నారని, పోలవరానికి రూ.58వేల కోట్లు అవసరం కాగా.. అందులో కేంద్రం రూ.7వేల కోట్లే ఇచ్చిందన్నారు. ప్రధాని ఇచ్చేది సొంత సొమ్మా? అని ప్రశ్నించారు. పోలవరం పనులు ముందుకెళ్లకూడదనేదే మోదీ ఉద్దేశమని మండిపడ్డారు. జులైలో పోలవరం గ్రావిటీ ద్వారా నీళ్లు అందించనున్నట్టు చంద్రబాబు స్పష్టంచేశారు.