ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో, అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై, చంద్రబాబు పై సిబిఐ ఎంక్వయిరీ వేస్తున్నారు అంటూ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు ఈ రోజు ప్రెస్ మీట్ లో స్పందించారు. ఒక్క ముక్కలో ఆ విషయాన్నీ తీసి పారేసారు. "సీబీఐ విచారణపై జగన్కుో అంత గౌరవం ఉంటే శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? తన కేసులపై సత్వర విచారణ కోరుతూ సీబీఐకి జగన్ లేఖ రాయొచ్చు కదా? వివేకా కేసులో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు? మేం రైతుల కోసం పోరాడుతుంటే మాపై సీబీఐ విచారణ అంటున్నారు. ఎలాంటి విచారణ అయినా చేసుకోండి, మేం భయపడం మేం ఏ తప్పు చేయలేదు.. భయపడే వాడు ఎవరు లేరు. దిక్కున్న దగ్గర చెప్పుకో అన్నాం. నేను లేస్తే మనిషిని కానంటారు, కానీ లెగవలేరు. తవ్వుతున్నాం, తవ్వుతున్నాం అని ఏడు నెలలుగా అంటున్నారు. ఎక్కడో జగ్గయ్యపేటలో 500 ఎకరాలు ఉంటే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు."
"ఆ భూమి వద్దు, మేము తీసుకోవడం లేదు, పరిశ్రమ పెట్టడంలేదని భరత్ చెబితే ప్రతిరోజూ దానిపై ఆరోపణలు చేస్తారు. చట్టపరంగా నీ వల్ల ఏమైతే అది చేసుకోండని అన్నాం. నువ్వు వేరేవాళ్ల దయాదాక్షిణ్యాల మీద ఉన్నావు, నేను లేను.. రాజధానికి టీడీపీ వాళ్లే భూములు ఇచ్చారని ప్రచారం చేశారు. అక్కడ వైసీపీ ఎలా గెలిచింది? మాట్లాడుతున్న దాంట్లో అర్థం ఉండాలి. ఆందోళన చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ప్రజల్ని అవమానిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాయలసీమలో రాజధాని ఎందుకు పెట్టరని అడుగుతున్నారు.. వాళ్లకు ఏం సమాధానం చెప్తారు? ఒక పేదవాడు తన పనికోసం ఊరూరా తిరగాల్నా..? ఈ చివర గ్రామం జిల్లా కేంద్రానికి, అక్కడ నుంచి మరో చివర రాజధానికి, మధ్యలో హెచ్ వోడిల వద్దకు తిరగాల్నా..? మీ వక్రమైన తెలివితేటలను రాష్ట్రంపై, ప్రజలపై చూపించకండి. మీ వక్రబుద్దితోనే రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు."
"నోటీసులు ఇవ్వకుండా ఎంపీని హౌస్ అరెస్ట్ చేస్తారా? ధర్నా చౌక్కిద వెళ్లే హక్కు మాకు లేదా? ఆ రోజు నాపై రాళ్లు వేసినప్పుడు నిరసనలు తెలిపే హక్కు ఉందని, రాజ్యాంగం స్వేచ్ఛఅందరికీ ఇచ్చిందని చెప్పింది ఈ డీజీపీ యే కదా..? మరి కేశినేని నాని ఎందుకని హవుస్ అరెస్ట్ చేశారు..? ఆందోళన చేస్తున్న తన ప్రాంత ప్రజలకు సంఘీభావంగా ఎంపిని వెళ్లకుండా అడ్డుకునే అధికారం ఎవరిచ్చారు..? విశాఖలో 24కిమీ మానవ హారాలు బలవంతంగా జనాన్ని దించి చేస్తుంటే అడ్డుపడరా..? ఇక్కడ మానవహారాలకు అడ్డం పడతారా..? డీజీపీ ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజలు గమనిస్తున్నారు. సీనియర్ నాయకుడిగా పోలీస్ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నా. చట్టం అందరికీ సమానం.. కొందరికి చుట్టం కాదు. వైసీపీ నేతలు, జగన్కుల చట్టం వర్తించదా? మందడంలో అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలి. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. రైతులకు, మహిళలకు సానుభూతిగా అన్నిజిల్లాల రైతులు,మహిళలు ఉండాలి.వారిపట్ల సంఘీభావం చూపాలి. ముఖ్యమంత్రి చెప్పాడని రైతులను, రైతు కూలీలను వేధిస్తే సహించేది లేదు. జగన్ రాజ్యాంగం, జగన్ చట్టాలు దేశంలో ఉండవు. భారత రాజ్యాంగం, భారత చట్టాలే ఉంటాయని’’ చంద్రబాబు పేర్కొన్నారు.