సీబీఐ మాజీ జేడీ, విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి విశాఖలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. విశాఖలో నేరచరితులకు చోటివ్వమన్నారు. "లక్ష్మీనారాయణలా కేసులను మధ్యలో వదలిపెట్టను. నాది ఉడుం పట్టు, పడితే విడవను. నీతివంతమైన, సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం. కేసీఆర్‌కు జగన్ ఊడిగం చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు జోలికి వస్తే వదలిపెట్టేది లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు.
మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో ఎందుకు చేరాడో ఆయనకే తెలియదని, ఆయనకు ఓటేస్తే ఓట్లు చీలిపోయి వైసిపి గెలుస్తుందని చెప్పారు. నీటి ఎద్దడిని తీర్చుతాం... " విశాఖకు నీటి ఎద్దడిని తీర్చుతాం. విశాఖను కాస్మొపాలిటిన్ సిటీగా తయారుచేస్తా. సింహాచలం భూముల సమస్యను పరిష్కరిస్తాం. పేదలందరికీ అర్బన్ ఏరియాలు ఇళ్లు కట్టిస్తాం. విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.25లక్షలు ఇస్తాం. విశాఖతో అహ్మదాబాద్ ఎక్కడా పోటీ పడలేదు" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించే క్రమంలోనే ఆయన జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.