తెలంగాణలో టీఆర్ఎస్‌కు టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాకున్నా కేసీఆర్ తనను విమర్శించడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని ఆయన చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో, చంద్రబాబు, మంత్రులు, కొందరు పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేయడం, ఆ సందర్బంగా జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ పై విరుచుకుపడటం పై ఆయన చర్చించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అయితే, తననుతిట్టడం ఏంటని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒక అవగాహనకు వచ్చారని తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నట్లు చెప్పారు. ‘‘అసెంబ్లీ రద్దుకు ముందు కేసీఆర్ రెండు మూడుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చారు. ఆయన వెళ్లి వచ్చిన మరుక్షణం జోనల్ వ్యవస్థ పై ఆగమేఘాలపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదంతా టీడీపీని, తనను చెడుగా చూపించి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారని ఈ విషయంలోనూ మోదీ-షాల వ్యూహం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ రద్దు పై మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్‌కు కేసీఆర్ ఇవ్వగానే వెంటనే అప్పటికప్పుడు దానిని ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమిస్తూ లేఖ కూడా ఇచ్చి పంపారు. జరుగుతన్న పరిణామాలను చూస్తుంటే టీఆర్‌ఎస్, బీజేపీ ఎంత కుమ్మక్కయారో తెలుస్తుందని, అందుకనే సమయం, సందర్భం లేకుండా మన పై విరుచుకుపడుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే ఏపీలో జగన్, పవన్ ఇద్దరూ కూడా మోదీ నడిపిస్తున్న శక్తులే అనే ఆయన అన్నారు.