నిన్న ప్రధాని మోదీ చంద్రబు ఆక్రోశంలో ఉన్నారని వ్యాఖ్యానించడం పై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గుజరాత్‌ను, ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడ మించిపోతుందో అనే ఆక్రోశం మోడీకే ఉందని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఆ కారణం తోనే మన రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అడ్డు పడుతూ, అక్కసు వెల్లగక్కుతున్నారని విమర్శించారు. మోడీ, నేను సియంలుగా పనిచేశామని, ఆయన అహ్మదాబాద్‌కు చేసిందేమీ లేదు అని, తాను హైదరాబాద్‌ను ఎలా అభివృద్ది చేశానో ప్రపంచమంతా తెలిసుని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి సహకరిస్తే, మనం అభివృద్ధిలో గుజరాత్ ని మించిపోతామనే భయం మోడీకి పట్టుకుందని దుయ్యబట్టారు. కనీస హుందాతనం అనేది లేకుండా మోడీ వ్యాఖ్యానించారని, ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని రాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారని మోడీ పై మండిపడ్డారు. ఈ రోజు ఉదయం పార్టీ నాయకులతో ‘జన్మభూమి-మా ఊరు’ చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని, ఈ 10 రోజులు అందరూ గ్రామాలు, వార్డుల్లోనే ఉండాలని చెప్పారు. అన్ని వైపుల నుంచి దుష్టశక్తులు రాష్ట్రం పై కక్ష కట్టాయని, అభివృద్ధి ఆగిపోవాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, అందరూ ఇది కీలక సమయంగా భావించి తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్ ఈ ఎన్నికలపైనే ఆధారపడి ఉందని, ఇప్పుడు పనులు అన్నీ ఆగిపోతే, ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 14 వరకు ఉన్న పరిస్థితులు వస్తాయని అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన కరెంట్ డబ్బులు చెల్లించరు గానీ పొరుగు రాష్ట్రం ప్రకటనలు ఆంధ్రలో, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా జీరో అని.. మోదీ, అమిత్ షా, ముగ్గురు సీఎంలు, 13మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణలో ఒక్క సీటు మాత్రమే గెలిచారని దుయ్యబట్టారు. తెలంగాణలో కూటమి విఫలం అని భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భాజపాయేతర కూటమికి బీటలు పడ్డాయని జైట్లీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.
నాలుగు రోజులు కూడా గడువివ్వకుండా హైకోర్టును తరలించారని విమర్శించారు. ఏపీలో తెదేపా గెలిస్తే తన అసమర్ధత బైటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసం జగన్‌కు అధికారం కావాలని, అందుకే మోదీ, కేసీఆర్‌తో జట్టుకడుతున్నారని అన్నారు. ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్లపై మనం పోరాడుతున్నామని, అలాంటి వారితో జగన్ స్నేహం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, జగన్, కేసీఆర్ ముగ్గురూ ఏపీపై పగబట్టారని, ముగ్గురు మోదీలతో మనం పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రజల్లో పట్టుదల పెరగాలని, అందరూ కసితో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్ 80కి పైగా సీట్లలో గెలిచారని, అన్నీ చేసిన మనం ఇంకా ఎక్కువ స్థానాల్లో గెలవాలని నేతలకు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మత వ్యవహారాల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని ట్రిపుల్ తలాక్ విషయంలో ఒకలా.. శబరిమలలో ఇంకోలా భాజపా కుట్రలు చేసిందని చంద్రబాబు విమర్శించారు. విభజించి పాలించాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం దిశా నిర్దేశం చేశారు.