కోడికత్తి పార్టీ నరేంద్ర మోదీతో, కేసీఆర్‌తో లాలూచీ పడిందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ‘‘వారు బిస్కెట్లు వేస్తారు. అందుకే, కుక్కలాగా విశ్వాసంగా పడి ఉంటారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కేసీఆర్‌కు ఎలామద్దతు పలుకుతారు? సిగ్గూ, రోషం ఉంటే కేసీఆర్‌ను జగన్ నిలదీయాలి’’ అని సవాల్ విసిరారు. మంగళవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్ర అభివృద్ధికి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ‘‘శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు తమ నియంత్రణలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌లో రిట్ వేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తోంది. అవన్నీ జరిగితే హంద్రీ నీవా ద్వారా నీళ్లు రాకుండా పోతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీకి ఇవి చివరి ఎన్నికలు కావాలని, కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని జగన్ తల్లి ప్రచారం చేస్తున్నారు. అలా అని వారి చెవిలో ఎవరైనా చెప్పారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘అన్ని నేరాలు చేసిన జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి కోరుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెల్లి కూడా అడుగుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని తెలంగాణ నుంచి వచ్చిన ప్రత్యేక దూతలు కోరుతున్నారు. ఇలాంటి నేరస్థుడికి ఒక్క అవకాశం ఇస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది’’ అని తెలిపారు. జగన్ ఒక సైకో అని, 31 అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతకు ప్రత్యేకంగా పిలుపు ఇస్తున్నానంటూ... ‘జగన్‌ను నమ్మితే జైలుకే! పవన్ కళ్యాణ్‌ను నమ్మితే అత్తారింటికే పోతారు. నన్ను నమ్మితే మాత్రం కెరీర్ బాగుంటుంది’’ అని హితవు పలికారు.
కేసీఆర్ బెదిరించి పంపిస్తుండటంతో హైదరాబాదు నుంచి వలస పక్షులు ఏపీకి వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. ‘‘ఎవరీ మోహన్‌బాబు? ఎవరీ జయసుధ? తితిలీ, హుద్‌హుద్ తుఫాన్ వచ్చినపుడు వచ్చారా?’ అని నిలదీశారు. కావాలంటే కేసీఆర్‌కు ఊడిగం చేసుకోవచ్చునని, జన్మభూమికి మాత్రం ద్రోహం చేయవద్దని సూచించారు. వైసీపీకి మోదీ, కేసీఆర్ నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు. ‘‘ఆ డబ్బుతో వైసీపీ నేతలు తప్పుడు పనులు చేస్తున్నారు. ఓటుకు రెండు వేలు ఇస్తున్నారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో టీవీ షోలు చేసుకునే ఎమ్మెల్యే మనకు అవసరమా అంటూ రోజాను ఉద్దేశించి నగరి సభలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘‘నోటి దురుసు తప్ప పద్ధతి లేని ఎమ్మెల్యే మనకు అవసరమా? ఆమెతో పాటు ఆ పార్టీ నాయకుడు కూడా అంతే. పద్ధతి లేని నాయకుడు! నన్ను 420 అంటాడా? నన్ను చెప్పుతో కొట్టాలని, నడిరోడ్డులో ఉరి తీయాలని, కాల్చి చంపాలని అంటున్నారు. ఇలాంటి సంస్కారం లేని వ్యక్తులను మీరు రాజకీయాల్లో ఎప్పుడైనా చూశారా!? ఇలాంటి వారికి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని విధంగా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు.