రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు, అబద్ధాలు, అభూతకల్పనలు ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టుపై అభూతకల్పనలు ప్రచారం చేస్తే సహేతుకంగా, నిజాయితీగా సమాధానం చెప్పాలని పోలవరం ప్రాజెక్టు పై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచించారు. పట్టిసీమను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ చేయని ప్రయత్నం లేదు. అయినా అన్ని సమస్యలు అధిగమించి రైతుల మన్ననలు, ఆశీర్వాదాలు పొందగలిగాం. పోలవరం పూర్తయితే ప్రతిపక్ష వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే అవాస్తవాలు, అబద్ధాలను ఆ పార్టీ ప్రచారం చేస్తుంది. .. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి విరాళాలు ఇస్తామని, తాము కూడా వచ్చి కూలీ పని చేస్తామని 1100కి సందేశాలు పంపుతున్న రైతన్నలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది విరాళాలు ఇస్తాం అంటున్నారు అని, వారి స్పూర్తి, రైతన్నల స్పూర్తి, ప్రోత్సాహమే మా ప్రభుత్వ బలం. పోలవరం పూర్తి చేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.. అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చి కొన్ని మండలాలను రాష్ట్రంలో కలిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. రాష్ట్రానికి జీవనాడి, ప్రాణనాడి అయిన పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. పోలవరం పూర్తయ్యే లోగా కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రభుత్వం తమ నిబద్ధతను చాటుకుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రాజెక్టు ప్రాంతంలోనే అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి రియల్ టైమ్ లో సమీక్షించి ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చిన తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం. పని చేసే సంస్థల సమస్యలు ప్రాజెక్టుకు శాపంగా మారకూడదు. ఇదే విషయాన్ని ఆయా సంస్థలకు, కేంద్రానికి తెలియపరిచామని ముఖ్యమంత్రి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అడిగిన సమాచారమంతా ఇప్పటికే అందజేశామని, మళ్లీ అడిగినా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ ముందు ఉంచామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పారదర్శకత, నిబద్ధత, దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ధిష్ట సమయానికి పూర్తి చేసి.. రాష్ట్ర అభివృద్ధి, రైతుల హితం, నీటి భద్రతను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం. పోలవరంపై అసెంబ్లీ ముందు ఉంచిన పారదర్శకత వివరణ.. శ్వేతపత్రం కన్నా ఎక్కువని సీఎం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కావడమే మాకు ముఖ్యం. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఎవరు సహకరించిన సంతోషంగా స్వీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.