తెదేపా సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. కిడారి, సోమ మృతిపై టీడీపీ సమన్వయ కమిటీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో తాజాగా చేరిన వ్యక్తిని మావోయిస్టులు ట్రాప్ చేసి కిడారి, సోమ కదలికలపై నిఘా పెట్టారని...ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారమే హత్యలు చేశారని తెలిపారు. మావోయిస్టులు సంచలనం కోసమే ఈ హత్యలు చేశారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల కోసం వైఎస్ హయాంలోనే ఆమోదం తెలిపారన్నారు. తాము అప్పుడు...ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరో పక్క, ఎంవీవీఎస్ మూర్తికి కూడా నివాళులు అర్పించారు. ఎంవీవీఎస్ మూర్తి తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మూర్తి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రహదారి భద్రత ఉండే అమెరికాలోనూ ఇలాంటి ఘటన జరగడం తనను కలచివేసిందన్నారు. పార్టీ అనేక సంక్షోభాలకు గురైన సమయంలో ఆయన అండగా నిలిచారన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. ఇటీవలి కాలంలో తెదేపా.. హరికృష్ణ, కిడారి సర్వేశ్వరరావు, మూర్తి వంటి కీలక నేతలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎంవీవీఎస్ మూర్తి చిత్రపటానికి చంద్రబాబు సహా మంత్రులు, తెదేపా ముఖ్యనేతలు నివాళులర్పించారు. ఇది ఇలా ఉంటే, ఈరోజు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగాల్సి ఉంది. అయితే మంగళవారం అమెరికాలోని అలస్కాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. తెదేపాలో సీనియర్ నేతగా ఉన్న మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.