తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని రోజుల క్రిందట, విజయవాడ వచ్చి, కులాల కుంపట్లు రగిలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో, తలసాని మాట్లాడుతూ, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఏమి చెయ్యబోతున్నారు అనే, అంశంపై ఓ చిన్న క్లూ ఇచ్చారు. కనీసం ఒక్క శాతం ఓట్ బ్యాంక్‌ను ప్రభావితం చేసినా మొత్తం తారు మారు అవుతుందని ఆయన చెప్పారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద ప్రధానంగా దృష్టిపెట్టాలని డిసైడైనట్టు కనిపిస్తోంది. ఇదే విషయం చంద్రబాబు ఈ రోజు ప్రస్తావించారు. తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. బీసీల్లో అపోహలు తేవాలని వైకాపా, తెరాస కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోదీ డైరెక్షన్‌లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు.
బీసీలను తెదేపాకు దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని.. ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. చిత్తూరుకు కృష్ణా జలాలు రావడం ఒక చరిత్ర అని.. కృష్ణా జలాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు. నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు. ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారానికొకరు రాష్ట్రానికి వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10లక్షల మందికి పైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు. ప్రధాని మోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని, భాజపా పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో వైఎస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ నిందించారని.. ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై కేసీఆర్‌దే రెండో సంతకమని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్ వైఎస్‌ను పొగుడుతున్నారని విమర్శించారు.