గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ విషయం, ఇంకా ఎటూ తేలలేదు. నాలుగు రోజుల క్రితం వంశీ జగన్ ను కలవటంతో, అందరూ వంశీ వైసీపీలో జాయిన్ అవుతున్నారని అనుకున్నారు. ఈ వార్త తెలియటంతో, గన్నవరం వైసిపీ ఇంచార్జ్ గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావ్ కూడా, ఆందోళన వ్యక్తం చేసారు. వంశీని పార్టీలోకి జాయిన్ చేసుకోవద్దు అంటూ సంకేతాలు ఇచ్చారు. ఇక మరోపక్క వంశీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి, చంద్రబాబుకు వాట్స్ అప్ మెసేజ్ చేస్తూ, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని, వైసిపీ దాడుల నుంచి తన కార్యకర్తలను కాపాడుకోవాలంటే, ఇది ఒక్కటే మార్గం అని చంద్రబాబుకు చెప్పారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, ఇలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని, ఇలాంటి వారితో పోరాటం చెయ్యాలని, ప్రజలకు వివరించాలని, మీకు పార్టీలో ఏమైనా ఇబ్బంది ఉంటే, కేశినేని నాని, కొనకళ్ళతో చెప్పండి అంటూ, చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అయితే దీని తరువాత, వంశీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కేశినేని నాని, వంశీని కలవాలి అనుకున్నా, వంశీ అందుబాటులోకి రాలేదు, ఆయన హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం వస్తుంది. అయితే, ఈ అంశం ఇలా కొనసాగుతూ ఉండగానే, చంద్రబాబు ఈ రోజు మరోసారి వంశీ విషయాన్ని ప్రస్తావించారు. ఈ రోజు విజయవాడ ఏ1 కన్వేషణ్ సెంటర్ లో జరిగిన, కృష్ణా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, వంశీ విషయాన్నీ ప్రస్తావించారు. మన నాయకుడు వల్లభనేని వంశీని కేసులు పెట్టి, ఇతర బెదిరింపులు చేస్తూ,లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, వంశీ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
వంశీ అసలు ఏ తప్పు చేసారని, కేసు పెట్టారని ? ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. వంశీ పై కేసు పెట్టటం కాదని, ఎమ్మార్వో, ఎస్సైని కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులకు భయపడకుండా, వాటిని ధీటుగా ఎదుర్కుని రాజీలేని పోరాటం చెయ్యాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీసే కుట్రకు తెర లేపారని, పంచాయతీ ఎన్నికల్లో, పోటీ చేయకుండా సరెండర్ పాలిటిక్స్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అచ్చెన్న, కూన రవి, సోమిరెడ్డి, యరపతినేనిపై కేసులు పెట్టారని, ఇప్పుడు వంశీ పై కేసులు పెట్టి, పార్టీ మార్పు పై ఒత్తిళ్ళు తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. అన్ని విషయాల పై, ఈ ప్రభుత్వంతో పోరాడాలని, నేతలకు, కార్యకర్తలకు పిలుపిచ్చారు.