ముసుగులో గుద్దులాట లేదు.. ఓపెన్ గా, ప్రజల ముందే, మీడియా సాక్షిగా, బీజేపీలో అత్యంత శక్తి వంతుడు, ఆర్ఎస్ఎస్ లో పట్టు ఉన్న, కేంద్ర మంత్రి, నితిన్ గడ్కరీ ముందే చంద్రబాబు కుండ బద్దలు కొట్టేసారు. విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో జరిగిన జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీతో, తెలుగుదేశం పార్టీ దూరానికి కారణాలను వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోవడమే బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య దూరానికి కారణమని చెప్పారు. విభజన హామీలు నెరవేరిస్తే ఇబ్బందులు ఏముంటాయని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజన హామీలన్నింటిని కేంద్రం నెరవేరుస్తామని చెబుతోంది కానీ, ఎంత సమయంలో వాటిని అమలు చేస్తారనేది ముఖ్యమని అన్నారు. ఈ హామీలను ఐదేళ్లలో కాకుండా పదేళ్లలో అమలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలని, విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయికీ కేంద్రానికి లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధమని అన్నారు. ‘పోలవరం’ ఖర్చు మొత్తాన్ని భరిస్తామన్న నితిన్ గడ్కరీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు.
పోలవరం ప్రాజెక్టులో సహాయ, పునరావాసం ఎంతో ముఖ్యమన్నారు. నూరు శాతం పారదర్శకంగా నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. గోదావరి జలాలతో కర్ణాటక, తమిళనాడు సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలన్నారు. విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఆరు వరుసల రహదారుల దిశగా గడ్కరీ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. వివిధ రహదారులను అభివృద్ధి చేయాలని గడ్కరీని కోరారు.