విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద "మన అమరావతి సెల్ఫీ పాయింట్‌ను" ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదు, పదేళ్లలో అమరావతిని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. సెల్ఫీలకు చిరునామాగా అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి బాండ్లకు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. రైతులు కూడా తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, త్వరలోనే శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ నాటికి అమరావతి రూపురేఖలు మారిపోతాయన్నారు. అయితే, ఇంతటితో చంద్రబాబు వెనుతిరగలేదు.
ఆ సెల్ఫీ పాయింట్ వెనుకే ఉన్న దుర్గా ఘాట్ చూసారు. వెంటనే అక్కడ ఉన్న అధికారులని పిలిపించారు. అదేమిటి, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా అనేక ప్రశ్నలు వేసారు. ఇంత మంచి స్పాట్ ని పర్యాటకంగా ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అంటూ, అక్కడ అధికారులని అడిగారు. దీంతో ఈయన ఇంకా ఏమి ప్రశ్నలు అడుగుతారో, ఎటు వైపు తనిఖీలు అని వెళ్తారో అని అధికారులు కంగారు పడ్డారు. చంద్రబాబు మాత్రం కొన్ని ఆదేశాలు ఇచ్చారు. దుర్గాఘాట్ ప్రాంత రూపు రేఖలు మార్చాలని, చక్కటి విహార, యాత్రా స్థలంగా రూపుదిద్దాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మన అమరావతి సెల్ఫీ పాయింట్ నిర్మాణంతో పాటు భారీ జాతీయపతాకం ఏర్పాటు చేయాలని అధికారులని కోరారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం వివరాలను కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాబోయే రోజుల్లో ప్రకాశం బ్యారేజీ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందాలని, దానికి తగ్గ ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు అన్నారు. కవైపు ప్రకాశం బ్యారేజీ, మరోవైపు కనకదుర్గమ్మ ఆలయం, మరో వైపు బస్టాండ్, ఇంకొకవైపు రైల్వేస్టేషన్ ఉండటంతో మోస్ట్ అట్రాక్టివ్ ప్రాంతంగా తయారు చెయ్యాలన్నారు. రాబోయే కాలంలో ప్రకాశం బ్యారేజీ దిగువన మరో ఆనకట్ట రానున్నదని, దీంతో మన అమరావతి సెల్పీ పాయింట్ నుంచి మూడు కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉండటంతో పాటు వాకింగ్ పాయింట్, జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంది అని అన్నారు. అమరా వతి నగరం ప్రపంచ ఐదు నగరాల్లో ఒకటిగా పేరుగాంచనుందన్నారు. 165కిలో మీటర్ల అవుట్రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కృష్ణానది ప్రకృతి అందాలతో మరింత శోభను సంతరించుకోనుందన్నారు. నూతన సంస్కృతికి శ్రీకారం చుడతామని, ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దతామన్నారు.