ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసనసభ సమావేశాల అనంతరం బుధవారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆక్టివ్ గా లేని వారి పై ఫైర్ అయ్యారు. ఎంతో చేస్తున్నా, సానుకూలతను ప్రజలకు చెప్పలేకపోతున్నారని, ప్రతిపక్షాల విమర్శలు సమాధానం కూడా ఎవరూ చెప్పటం లేదని అన్నారు. ప్రతిపక్షం విమర్శలపై సమాధానం చెప్పడానికి ముగ్గురు, నలుగురు మించి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌కు వెళ్లడం లేదు, ఇలా అయితే ఎలా అంటూ, మందలించారు. ఎవరు ఎలా పని చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, అంతా రికార్డు అవుతుందని, మీరు పని చేసే దాన్ని బట్టే నేను మీకు సహరిస్తా అని అన్నారు.
ఈ సందర్భంగా, మీడియాలో సత్వ ర స్పందన బాగుంటోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను చంద్రబాబు ప్రశంసించారు. ‘‘వెంకన్న రఫ్ అని అనుకొనే వాడిని. కానీ, తనను తాను బాగా తీర్చిదిద్దుకొన్నాడు. ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే తక్షణం మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నాడు. ఆయనకు నేను చెప్పలేదు. తనకు తాను స్పందించి పనిచేస్తున్నాడు. వెంకన్నకు నా అభినందనలు’’ అని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. విభిన్న రాజకీయ అంశాల మీద కూడా వెంకన్న చక్కగా మాట్లాడుతున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. సాధారణంగా చంద్రబాబు ఎవరినీ అంతగా పొగడరు. అలాంటిది అందరి ముందు ఆయన వెంకన్నను మెచ్చుకోవడంతో సమావేశం ముగియగానే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బుద్దా వెంకన్నను అభినందించారు.
ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతూ బిజీగా ఉంటారని ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీలు మీడియా ముందుకు, టీవీ డిబేట్లకు వెళ్ళవచ్చు కదా అని సిఎం ప్రశ్నించారు. అతిగా వ్యవహరించినా, మందకొడిగా ఉన్నా నష్టాలే అన్నారు. ఏ కొందరు నాయకుల వల్లో పార్టీకి చెడ్డ పేరు రాకూడదన్నారు. ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినా ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పార్టీపై పడుతుందని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం కలిగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. విశ్వసనీయత అనేది రాత్రికి రాత్రే రాదని కొనే్నళ్లు, దశాబ్దాల కష్టం ప్రజల్లో మన పట్ల విశ్వసనీయతకు కొలమానమని ఉద్ఘాటించారు. ఈ పరిస్థితుల్లో ఏ తప్పుచేసినా దశాబ్దకాల కష్టం నిరుపయోగంగా మారుతుందని హితవు పలికారు. ప్రతిపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆరోపణలు నిగ్గుతేల్చకపోతే నిజాలని భ్రమపడే ప్రమాదం ఉందని ఇంటింటికీ వెళ్లి ఆత్మీయంగా పలుకరించాలన్నారు.