సగర్వంగా రెపరెపలాడే మన జాతీయ జెండాను చూసినంతనే త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గుర్తుకు వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దేశభక్తుడు అనే మాటలకు పింగళి నిజమైన నిర్వచనమని కొనియాడారు. 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జన్మించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే కాక, దేశానికే ముద్దుబిడ్డ అని, తుది శ్వాసదాకా విలువలకు నిబద్ధుడై, నిజాయతీగా జీవించారని చంద్రబాబు కొనియాడారు.
19 ఏళ్లకే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారని, ఆఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయర్ (Alglo Boer) యుద్ధంలో పాల్గొన్నారని చెప్పారు. పింగళి వెంకయ్యకు ఆనాడు మహాత్మునితో ఏర్పడిన తొలిపరిచయం ఐదు దశాబ్దాలు కొనసాగిందని అన్నారు. పింగళి వెంకయ్య మహాత్ముని అభిమానం పొంది ఆయన సూచనలతో జాతీయ జెండాకు రూపకల్పన చేసిన ధన్యజీవి అని చెప్పారు. సత్యం, అహింసలను ఆచరించటం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించిన మహనీయుడని, ఆ స్ఫూర్తితోనే మహాత్మాగాంధీ సూచనలతో జాతీయపతాకానికి పింగళి రూపకల్పన చేశారన్నారు.
ముప్ఫయ్ దేశాల జాతీయ పతాకాలను పరిశీలించి మన దేశ జాతీయ పతాకాన్ని తయారు చేశారన్నారు. ఆయన వ్యవసాయం, భూభౌతిక శాస్త్రం మీద ఎంతో ఆపేక్ష కనపరిచారని, జపనీస్ సహా అనేక విదేశీ భాషల్లో ప్రవేశం ఉందన్నారు.
పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్టా జిల్లా దివి తాలూకాలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జెండాను రూపొందించి అందించారు. ఈ త్రివర్ణ పతాకంలో ఉండే మూడు రంగులు ... కేసరి (కాషాయం) - ధైర్య సాహసాలకు, త్యాగానికి తెలుపు - శాంతి, సత్యాలకు, ఆకుపచ్చ - ప్రగతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక నెలకొల్పిన విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పింగళి వెంకయ్య పేరు పెట్టారు .