తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే, చింతమేని ప్రభాకర్ 66 రోజుల తరువాత, ఏలూరు సబ్ జైలు నుండి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చింతమనేనికి స్వాగతం పలికారు. పోలీసులు సెక్షన్ 30 ఆక్ట్ ఉంది అంటూ చెప్పినా, చింతమనేని ర్యాలీగా కొంత దూరం వెళ్లారు. అయితే పోలీసులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అయితే, చింతమనేనికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. "ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని ప్రభాకర్ పై 11కేసులు పెట్టారు. 9ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా అన్యాయం ఇంకోటి లేదు. వైసిపి అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి. తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది" అంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం నుంచి మూడు రోజల పాటు పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి, అక్కడ పరిస్థితి పై సమీక్ష చేస్తున్నామని, అక్కడ కలుద్దామని చంద్రబాబు, చింతమనేనితో అన్నారు.
చింతమనేని ప్రభాకర్ పై 18 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటికే 14 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. మళ్ళీ శుక్రవారం మరో నాలుగు కేసుల్లో చింతమనేనికి బెయిల్ మంజూరు అయింది. ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై చింతమనేని దాడి చేసి కులం పేరుతో తిట్టారని, పెదపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో సెప్టెంబర్ 11న పోలీసులు చింతమనేని అరెస్టు చేసి, కోర్ట్ లో హాజరు పరచటంతో, ఆయనకు రేమాండ్ విధించారు. అప్పటి నుంచి, పీటీ వారెంట్‌పై మరో 17 కేసుల్లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి, 66 రోజులుగా చింతమనేని ఏలూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే, చింతమనేని పై మరో రెండు పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అంటున్నారు. ఇప్పటికే చింతమనేనికి, తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా నిలిచింది. నారా లోకేష్ తో పాటుగా, అనేక మంది తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లి ఆయన్ను జైలులో కలిసారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిసి పరామర్శించి, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అయితే ఇప్పుడు చింతమనేని తరువాత అడుగు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. ఆయన దూకుడు తెలిసిన వారు మాత్రం, ఇది చింతమనేనికి, జగన్ చేతులారా ఇచ్చిన అవకాసం అని, ఆయన ఒక పెద్ద నాయకుడుగా ఎదుగుతారని, ఈ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కుంటారని, ఆయన అభిమానులు అంటున్నారు.