సొంత నియోజకవర్గమైన భీమిలి ప్రజల్లో తనపై అసంతృప్తి ఉందని వార్త రావడంతో గత మూడ్రోజులుగా ముభావంగా ఉంటూ.. ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన మంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ఫోన్ చేసారు. "పత్రికల్లో రకరకాల సర్వేలు వేస్తుంటారు. వాటిని పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. నా పనితీరు కూడా బాగోలేదని వచ్చిందిగా. ఏదీ మనసులో పెట్టుకోవద్దు" అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తన నియోజకవర్గమైన భీమిలిలో సక్రమంగా పనిచేయడం లేదని, ఆయన వెనుకబడిపోయారని ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తలతో తీవ్ర అసంతృప్తికి లోనైన గంటా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.
‘శ్రీనూ! అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. నా మీద కూడా రోజూ రకరకాల వార్తలు వస్తుంటాయి. ఏవేవో సర్వేలు వేస్తుంటారు. అవన్నీ పట్టించుకుంటే నేను పనిచేయలేను. ఇప్పుడు ఈ సర్వేలో కూడా నా పనితీరు బాగోలేదని కొన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయపడినట్లు వేశారు. వాటిని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుని ముందుకు వెళ్తుండాలి. నన్ను దులిపేస్తూ అనేక వ్యాసాలు వచ్చిన రోజులున్నాయి. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేక కథనాలు వేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం. టీం వర్క్‌తో పనిచేయాలి. అలా ముభావంగా ఉండొద్దు’ అని గంటాకు సూచించారు.
తనను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నానని మంత్రి అన్నట్లు సమాచారం. ఇంత పెద్ద పార్టీలో అందరూ ఒకే మాదిరిగా ఉండరని సీఎం చెప్పారు. దీనికి ముందు గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి పి.నారాయణ కూడా ఆయనతో మాట్లాడినట్లు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడాక గంటా వేదన కొంత తగ్గినట్లు కనిపిస్తోంద ని, గురువారం విశాఖలో జరిగే సీఎం కార్యక్రమానికి ఆయన హాజరవుతారని ఆశిస్తున్నామని టీడీపీ వర్గాలు తెలిపాయి.