కేరళ సీఎం విజయన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని బాబు చెప్పారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి సిబ్బంది మరబోట్లు, పడవలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను మంగళగిరి నుంచి కేరళకు ఏపీ ప్రభుత్వం పంపింది. ఆహార పదార్ధాలు, పాలు, పండ్లు, బిస్కెట్లను ప్రభుత్వం పంపనుంది. ఇప్పటికే చంద్రబాబు కేరళకు రూ.10కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ వరద బాధితులకు తమ నైతిక సాయం ఉంటుందని, వస్తు సామగ్రి రూపంలోనూ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏపీ నుంచి సహాయ బృందాలను పంపేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేరళ త్వరగా విపత్తు నుంచి బయటపడాలని, అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు.
కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. donation.cmdrf.kerala.gov.in ద్వారా సాయం చేయాలని కోరారు. మరో పక్క, కేరళ రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ.500 కోట్ల తాత్కాలిక సాయాన్ని ప్రకటించారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం మోదీ ఈ సాయాన్ని ప్రకటించారు. అయితే తక్షణ సాయంగా రూ.2000 కోట్లు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. అయితే ప్రధాని మోదీ ప్రకటించిన తాత్కాలిక సాయం రూ.500 కోట్లు కాగా, ఇంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్రం తరఫున ప్రకటించిన సాయం రూ.100 కోట్లు దీనికి అదనం.
కాగా, కేరళకు రూ.500 కోట్ల తక్షణ సాయంపై పీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. 'ప్రస్తుతం ప్రకటించన రూ.500 కోట్లకు, ఈనెల 12న హోం మంత్రి ప్రకటించిన రూ.100 కోట్లు అదనం. దీనికి తోడు వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు' అని పీఎంఓ తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ వరద పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మోదీని ఓ ట్వీట్‌లో కోరారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, లక్షలాది మంది ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.