రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో, ప్రభుత్వం ఉండటంతో, ఇప్పటికే 19 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ ఉద్యమం ఉదృతం అవుతుంది. ఈ రోజు రైతులు మహా పాదయత్ర చేసారు. ఒకేసారి దాదాపుగా 10 వేల మంది రైతులు మహా పాదయాత్ర చెయ్యటంతో, అమరావతి దద్దరిల్లింది. మరో పక్క రైతులకు అండగా రాజకీయ పార్టీలు కూడా నిలిచాయి. వైసీపీ తప్ప, అన్ని రాజకీయ పార్టీలు, రైతులకు మద్దతు ఇస్తున్నాయి. రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్తూ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సేవ్ ఏపి, సేవ్ అమరావతి పేరుతో, 24 గంటలు పాటు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. గద్దె చేస్తున్న దీక్షకు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తన మీద కోపం ఉంటే, తన పై తీర్చుకోవాలని, భూములు ఇచ్చిన రైతుల పై కాదని, అమరావతిని నాశనం చెయ్యొద్దని కోరారు.
విజయవాడ అంటే రాజకీయ చైతన్యానికి మారు పేరు అని, అమరావతిని నాశనం చెయ్యకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. మన పిల్లలు, మన కళ్ళ ముందే ఉండాలనే ఉద్దేశంతోనే, అమరావతి నిర్మాణం ప్రారంభించామని, రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇక్కడ మంచి చదువు, ఉపాధి దొరుకుతుందని, సిటీని డిజైన్ చేసామని, ఇప్పుడు ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళిపోతే, ఇక్కడ నుంచి వెళ్ళేది కేవలం సచివాలయం కాదని, మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు అని అన్నారు. మళ్ళీ మనం వేరే రాష్ట్రాలకు చదవు కోసం, ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి అని, మన భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, భూములు ఇచ్చిన రైతుల కోసం అందరూ పోరాటాలు చెయ్యాలని చంద్రబాబు కోరారు.
ఈ సందర్భంగా, అనేక మంది మహిళలు, ఈ పోరాటానికి విరాళాలు ఇచ్చారు. ఒక మహిళా నాలుగు బంగారు గాజులు ఇచ్చారు. మరో మహిళ మాట్లాడుతూ, తాను, తన భర్తకు చెప్పకుండా ఎప్పుడూ బయటకు రాలేదని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పోరాటం చూసి, ఉద్వేగంతో ఇక్కడకు వచ్చానని, అమరావతి పోరాటం కోసం, నా చేతికి ఉన్న రెండు ఉంగరాలు ఇస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుని ఒక కోరిక కోరారు. నా భర్తకు చెప్పకుండా వచ్చానని, మీరే ఫోన్ చేసి, ఆయనకు ఈ విషయం చెప్పాలని చెప్పటంతో, చంద్రబాబు మీటింగ్ లోనే, ఆమె భర్తకు ఫోన్ చేసి, మీ భార్య అందరికీ ఆదర్శంగా నిలిచారు, మీరు కూడా ఆమెను ప్రోత్సహించాలి, మిగతా మగవారికి కూడా చెప్పండి, మన పిల్లల భవిష్యత్తు కోసం, అందరూ ముందుకు రావాలని చెప్పండి అంటూ, ఆమెను, ఆమె భర్తను, ఈ మహా పోరాటానికి స్పూర్తిని ఇచ్చినందుకు, అభినంధించారు. రాష్ట్రంలో అందరూ మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం పోరాటం చెయ్యాలని కోరారు.