మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. కరోనా నిబంధనల పేరుతో చంద్రబాబుని అడ్డుకున్నారు. అయితే దీనికి నిరసనగా చంద్రబాబు గత నాలుగు గంటలుగా ఎయిర్ పోర్ట్ లోనే నిరసన తెలుపుతున్నారు. తనను చిత్తూరు వెళ్ళనివ్వాలని చంద్రబాబు కోరుతున్నా పోలీసులు స్పందించటం లేదు. అయితే చంద్రబాబుని ఎయిర్ పోర్ట్ నుంచి పమించి వేయాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్‍జెట్‍ ఉండటంతో, ఆ ఫ్లైట్ లోనే చంద్రబాబుని తిప్పి పంపించాలని పోలీసులు ప్లాన్ చేసారు. అయితే ఆ ఫ్లైట్ లో టిక్కెట్ లు అన్నీ అయిపోవటంతో, చంద్రబాబుని పంపించటానికి, మార్గాలను పోలీసులు వెతుకుతున్నారు. విమానం పూర్తిగా నిండిపోవటంతో, చంద్రబాబుని ఎలా పంపిస్తారు అనే విషయం పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ దశలో చిత్తూరు జిల్లా ఎస్పీ, ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. చంద్రబాబుతో చర్చిస్తున్నారు. తనను ఎందుకు ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించారో చెప్పాలని చంద్రబాబు ఎస్పీని నిలదీశారు. ఎన్నికల సంఘం కూడా తన పర్యటనకు అనుమతి ఇచ్చిందని, మీరు ఎందుకు నన్ను అడ్డుకున్నారు అంటూ, చంద్రబాబు ఎస్పీని నిలదీసారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు, తమ అధినేతను కావాలని అవమానించటం పై, ఆగ్రహంగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో నిరసన తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇప్పటికే అనేక సార్లు చంద్రబాబుని అడ్డుకున్నారని, ఇంకా ఎంత కాలం ఇలా ఆరాచకాలతో పాలన సాగిస్తారు అంటూ ట్వీట్ చేసారు. జగన్ పతనానికి నాంది, ఈ సంఘటన అంటూ వాపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, ఈ వ్యవహారం పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పందించాలని, సుమోటోగా వ్యవహారం పై ఎన్నికల కమిషన్ స్పందించాలని అన్నారు. మేము ఎన్నో ఫిర్యాదులు ఇస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవటం లేదని, కేవలం వాటిని కలెక్టర్ లకు పంపి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ, చంద్రబాబును నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం అని, రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని అన్నారు. జగన్ పాలనలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఈ పధ్ధతి మారాలని వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read