ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని తాను పోరాడుతుంటే భయపడుతున్నామంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ‘తప్పులు జరగకూడదు. మరో రాష్ట్రంలో ఇలా జరగకూడదనేదే మా ఆలోచన. దొంగదారులకు వీల్లేదు’ అని స్పష్టం చేశారు. సోమవారం తెదేపా కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘వీవీపాట్‌లలో పడే పత్రాల్లో 50 శాతం లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటి?’ అని నిలదీశారు. ‘అన్ని పార్టీలు అంగీకరించినప్పుడు కాదనడానికి వారెవరు? ప్రజలు చెబుతున్నా కుదరదంటూ పెత్తనం చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో 115 నుంచి 130 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తున్నాం. వెయ్యి శాతం గెలుపు మనదే’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందని, కొన్ని ఈవీఎంల పనితీరు సరిగా లేదని సీఈసీ చెబుతోందని, అలాంటప్పుడు వాటిని ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణితో ఈసీ వ్యవహరించిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వద్దనుకున్న ఈవీఎంలు మనకు ఎందుకని అన్నారు. ఈసీకి ఎన్నికలు నిర్వహించడం మీద కన్నా.. రాజకీయాలు చేయడం.. నేతలు చెప్పినట్టు తలాడించడంపైన శ్రద్ధ ఎక్కువని విమర్శించారు. ఈవీఎంల విషయంలో.. దశాబ్దాలుగా ఏం చెబుతున్నానో ఇప్పుడూ అదే మాట్లాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈవీఎంలపై తన పోరాటం ఈనాటిది కాదని, ఈసీని కూడా మోదీ పూర్తిగా భ్రష్టుపట్టించారని చంద్రబాబు ఆరో్పించారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల మీదకు వాడుకునే.. ఒక ఆయుధంగా ఈసీని తయారు చేశారన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించే వరకు తన పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 23 పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యాచరణ చేపడుతామని అన్నారు. యంత్రాంగాన్ని రాజ్యాంగ సంస్థలను కూడా.. మోదీ దుర్వినియోగం చేసి అడ్డగోలుగా గెలవాలనుకుంటున్నారని, మేము అలా జరగనివ్వమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తమ పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు.