ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి ఒక పూట విరామం ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆయన శనివారం ఉదయం ఆయన నివాసంలోనే ఉన్నారు. అయితే, అక్కడ మాత్రం విరామం తీసుకోకుండా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, ప్రస్తుత సమయంలో పార్టీ పరిస్థితి, ప్రచార శైలి ఎలా ఉంది అనే వాటిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంత మంది నేతలతో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో ఓడితే నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కూడా అవకాశం ఉండదని, రానున్న ఐదేళ్లు వారు పార్టీలో సామాన్య కార్యకర్తలుగా పని చేయాల్సిందేనని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
మధ్యాహ్నం వరకు నివాసంలోనే తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షలు చేయబోతున్నారు. దీని అనంతరం ఆయన శ్రీకాకుళం జిల్లాకు పయనమవుతారు. అక్కడ జరగనున్న ప్రచారంలో పాల్గొని, రాత్రి అక్కడే బస చేస్తారు. రాష్ట్ర ప్రజల్లో ఇంత గొప్ప స్పందన తన జీవితంలో చూడలేదని, ప్రచారంలో పాల్గొన్న ప్రతి చోటా జన సముద్రమే కనిపిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమండ్రిలో మహిళలంతా ఏకపక్షం అయ్యారన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రలోని మహిళలంతా తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. ఎక్కడ చూసినా పార్టీ ప్రచారం ఉధృతంగా సాగుతోందని, ప్రత్యర్థుల ఆరోపణలను బలంగా తిప్పికొడుతున్నారని చంద్రబాబు తెలిపారు.
ఇదే స్ఫూర్తి రాబోయే రెండు వారాలు కొనసాగించాలని కోరారు. తానింత కష్టపడేది ప్రజల కోసం, పార్టీ కోసమేనని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా 10 సూత్రాలు ప్రకటించామని, పేదరిక నిర్మూలనకు టీడీపీ 10 సూత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎవరు ఎంత అణచివేతకు గురిచేసినా అంతే స్థాయిలో పార్టీ పైకి లేస్తుందన్నారు. రేపటి ఎన్నికల్లో ప్రజాతీర్పు దేశానికి దిక్సూచి కాగలదన్నారు. జమ్ము కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీడీపీ తరుపున ప్రచారం నిర్వహించారని, త్వరలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ ఉద్దండులు టీడీపీకి మద్దతుగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 22 పార్టీల నేతలు అండగా ఉన్నారని, బీజేపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకమన్నారు. టీడీపీ గెలుపు దేశానికి మరో మలుపన్నారు.