ఎంతో మంది నాయకులు, మేము అది చేస్తా, ఇది చేస్తాం, దేశాన్ని మార్చేస్తాం, కొత్తగా ఆలోచిస్తాం అంటూ ఉపన్యాసాలు మాత్రం దంచి కొడతారు. ఆచరణలో మాత్రం ఏమి ఉండదు. చంద్రబాబు మాత్రం అలా కాదు, మాటలతో పాటు, చేతల్లో కూడా చేసి చూపిస్తారు. ఏ సంస్కరణలు అయినా, చేసి చూపించి, దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. అలా అని ఇవేవో, ఓట్లు రాలే పనులు కూడా కాదు. పర్యావరణరహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం, ఎందరో మాట్లాడటం మనం చూసాం, కాని మన రాష్ట్రంలో మాత్రం, ఇప్పటికే అవి మొదలయ్యాయి. తాజాగా ఈ రోజు కూడా మరి కొన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. ముందుగా ప్రభుత్వంలో వీటిని ఉపయోగించి, నెమ్మదిగా ప్రజలకు కూడా ఇవే అలవాటు చెయ్యనున్నారు.
పర్యావరణరహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుగుణంగా ఇప్పటికే తమ ప్రభుత్వం పాలసీని సిద్దం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్ధ, మహీంద్ర ఎలక్ట్రిక్, జూమ్ కార్ సంయిక్త భాగస్వామ్యంలో ఇక విజయవాడ రోడ్ల పై పరుగులు తీయనున్న బ్యాటరీ కార్ల శ్రేణిని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సికె కన్వెన్షన్ సెంటర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పర్యాటకులకు ఉపయోగపడేలా మహీంద్రా జూమ్ కార్లు ఉపయోగపడటం ముదావహమన్నారు.
ఇప్పటికే పూనా, కోల్‌కతా, ముంబై, న్యూడిల్లీ, జైపూర్, హైదరాబాద్, మైసూర్‌లలో ఇవి నడుస్తుండగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ది సంస్ద భాగస్వామ్యంతో పరుగులు పెట్టనుండటం సంతోషమన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిముఖ్యమైన కూడలి నగరంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందని, వినూత్న ఆవిష్కరణలతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఎవరికి వారు డ్రైవింగ్ చేసుకునేలా ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ అద్దె కార్లు గన్నవరం విమానాశ్రయం, బెంజిసర్కిల్, సచివాలయంల వద్ద అందుబాటులో ఉంటాయని, నిబంధనల మేరకు ఎవరైనా వీటిని తీసుకోవచ్చని అన్నారు.
మహీంద్రా ఎలక్ట్రిక్ సిఇఓ మహేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. జామ్ కార్ సంయిక్త వ్యవస్ధాపకుడు, సిఇఓ గ్రేగ్ మోరాన్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 15 వాహనాలను ప్రవేశపెడుతున్నప్పటికీ భవిష్యత్తు డిమాండ్ మేరకు మరిన్ని వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఆంద్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ద నిర్వహణా సంచాలకులు హిమాన్హు శుక్లా మాట్లాడుతూ పర్యాటక శాఖ వెబ్ సైట్‌తో పాటు, ఇతర ప్రచార సామాగ్రిలో కూడా జూమ్ కార్ భాగస్వామ్యం గురించి పర్యాటకులకు వివరిస్తామన్నారు.
అమరావతి రాజధానిలో సుస్ధిర పర్యావరణ వ్యవస్ధను ఏర్పాటు చేయటానికి ఇవి ఉపకరిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ద అధ్యక్షులు అచార్య జయరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రాధికార సంస్ధ సిఎంఓ శ్రీనివాసరావు, జియంలు హరనాధ్, సుదర్శన్, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు. పర్యాటక శాఖ నూతనంగా సమకూర్చుకున్న ఆధునిక ఓల్వో బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. పర్యాటక అభివృద్ది సంస్ధ ఛైర్మన్ అచార్య జయరామిరెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, అంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ సిఇఓ హిమాన్హు శుక్లా ఇతర అధికారుల సమక్షంలో మంగళగిరి సికె కన్వెన్షన్ సెంటర్ జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా బస్సులోకి వెళ్లి పరిశీలించిన సిఎం సౌకర్యాలను గురించి శుక్లాను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం నుండి తిరుపతికి ఈ బస్సులను నడపనున్నామని, ఈ సందర్భంగా శుక్లా ముఖ్యమంత్రికి వివరించారు. పర్యాటక సౌకర్యాల కల్సనలో ఎటువంటి రాజీ లేని ధోరణి వద్దని ఈ సందర్భంగా సిఎం అన్నారు.