ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు వస్తుందని తెలుగుదేశం అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన కోల్‌కతాలో పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఇటీవల జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. తొలి ఐదు దశల ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకత అత్యంత స్పష్టంగా కనిపించింది. నెంబర్లు చెప్పను కానీ... 23వ తేదీ తర్వాత మోదీ గద్దె దిగడం మాత్రం ఖాయం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాల తరఫున ప్రధాని ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘‘మేమంతా బలమైన నాయకులమే. నరేంద్ర మోదీకంటే ఎవరైనా మెరుగే. ప్రధాని ఎవరన్నది ఫలితాల తర్వాత సమావేశమై నిర్ణయిస్తాం’’ అని తెలిపారు.
వీలైతే ఫలితాలు వచ్చే 23వ తేదీనే విపక్షాల సమావేశం నిర్వహిస్తామన్నారు. పోలింగ్‌కు రెండురోజుల ముందు...అంటే 21వ తేదీన బీజేపీయేతర పార్టీల సదస్సు పెడదామని అనుకున్నా... దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని పోటీలో ఉన్నారా? అని ప్రశ్నించగా... దానిపై తమ మధ్య చర్చ జరగలేదన్నారు. తాను మాత్రం ప్రధాని పోటీలో లేనని... సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరిస్తానని చంద్రబాబు తెలిపారు. మోదీ కేవలం ప్రత్యర్థులపై బురదజల్లడం, దాడి చేయడం, విమర్శించడం తప్ప... ప్రజలకు ఇస్తున్న సందేశమేదీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. పాతికేళ్ల క్రితం మరణించిన రాజీవ్‌గాంధీని ఇప్పుడు ఎన్నికల్లోకి లాగడంలో హుందాతనం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంత హీనమైన రాజకీయాలు ఎప్పుడూ లేవన్నారు.
బెంగాల్‌లో మోదీ, అమిత్‌షా పదేపదే తిరుగుతున్నప్పటికీ... వారికి ఇక్కడ వచ్చే సీట్లేమీ ఉండవని చంద్రబాబు తెలిపారు. మమతా దీదీని మోదీ సవాల్ చేయలేరన్నారు. ఈ విషయం గమనించే మతతత్త్వం రెచ్చగొట్టాలని... బెంగాల్ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘‘ఎన్నికల సంఘం కూడా బీజేపీ తరఫున పని చేస్తోంది. తన విశ్వసనీయతను కోల్పోయింది’’ అని తెలిపారు. మరోవైపు... ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్‌ను మొన్నటివరకు మోదీ తీవ్రంగా విమర్శించారని, అక్కడ తమకు అనుకూల ఫలితాలు రావని తేలడంతో ఫణి తుఫానుకు సాయం ప్రకటించడం ద్వారా నవీన్‌ను దగ్గర చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు.