తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, ట్విట్టర్‌లోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానంటే తాను అడ్డుపడ్డానా? అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానంటే అడ్డుతగిలానా? అంటూ నిలదీశారు. తెలంగాణ అభివృద్ధికి తాను ఎక్కడ అడ్డుపడ్డానో కేసీఆర్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తన పాలనలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్కపనైనా చేశారా? అని ఆయన సవాల్ విసిరారు. ఇచ్చిన మాట తప్పి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీశారా? అంటూ బాబు విమర్శించారు.
అవేవి చేయకుండా హైదరాబాద్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసిన తనపై విమర్శలు చేయడం ఏమిటో తనకు అర్థం కావడంలేదని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ చెప్పే అచ్చేదిన్ నాలుగున్నరేళ్లలో ఎక్కడా కనిపించలేదని ఎద్దేవాచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే తప్పకుండా అచ్చేదిన్ వస్తుందని వ్యాఖ్యానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాకపోయినా కేసీఆర్ అడగరని, గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వకపోయినా నోరు మెదపరని, ఎయిమ్స్‌కు అనుమతులు ఇవ్వకపోయినా నిలదీయారని, చివరికి ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోయినా తానకేమీ పట్టనట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దీన్నిబట్టి చూస్తుంటే మోడీతో కేసీఆర్ ఎంత రహస్య ఒప్పందం చేశారో తెలుస్తుందని చెప్పారు
నేనెవరికీ భయపడను… భయపడే సమస్యే లేదు… నన్ను బెదిరించిన వాళ్ళంతా పతనమైపోయారు… ప్రధాని నరేంద్రమోడీ కూడా భయపెట్టేందుకు ప్రయత్నించాడు… ఐటీ, ఈడీని పంపించాడు… నాతో పెట్టుకుంటే కొరివితో పెట్టుకున్నట్టే… తస్మాత్ జాగ్రత్త అంటూ తెరాస అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్ తనను బెదిరిస్తున్నారని, ఈ ఊ కదంపుడు హెచ్చరికలను తాను ఖాతరు చేయనని నరేంద్రమోడీకన్నా ముందే తాను ముఖ్యమంత్రిని అయ్యానని జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించానని చెప్పారు. గత ఎన్నికల్లో తెరాస అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకే కొత్త హామీలు ఇచ్చేందుకు ఆయన బయలుదేరారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏసీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కేసీఆర్ చేసిందేమీ లేదని మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పులపాలు చేశారని మండిపడ్డారు.