రాజధానిపై భాజపా, వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అసెంబ్లీ, సచివాలయంలో నీరు లీకవుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాణ్యతలో తేడా ఎక్కడుందో చూపాలని సవాలు విసిరారు. రాజధానిపై భాజపా ఎందుకంత విషం కక్కుతోందని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ‘రాజధాని నగర నిర్మాణం, ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి’పై మంగళవారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు.
‘రాజధాని ఆకృతులను తీసుకెళ్లి చూపించినా ప్రధాని మోదీ ఆసక్తి కనబరచలేదు. మోదీ 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అహ్మదాబాద్ అలాగే ఉంది. నేనుతొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి హైదరాబాద్, సికింద్రాబాద్ సరసన సైబరాబాద్‌ను తయారుచేశా.. సిటీ కోర్టు భవనం డిసెంబరు నాటికి పూర్తవుతుంది. ఆ సమయానికి హైకోర్టు ఇక్కడకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే లేఖ రాశా. అయినా కోర్టు విషయంలో రాజకీయం చేస్తారా? అదే హైకోర్టులో పెడతాం అని సుప్రీంకోర్టులో కౌంటరు దాఖలు చేస్తారా? దీన్నేమనాలి?
అమరావతి మ్యాపులు ఇంకా సింగపూర్‌లోనే ఉన్నాయని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అంటున్నారు.. ఇక్కడేమో భవనాలు అంతస్తులకు అంతస్తులే పైకి లేస్తున్నాయి. తలెత్తి చూడాల్సి వస్తోంది. రాజధాని నిర్మాణంవల్ల కేంద్ర ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. మేం పన్నులు కట్టాలి.. మీరు పెత్తనం చేస్తారా? అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి, ఇప్పటి కేంద్రానికి తేడా ఏమైనా ఉందా? రెండు రాష్ట్రాల మధ్య ద్వేషాలు సృష్టించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ అమరావతిపై ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. కొండవీటివాగు, పాలవాగు వరదతో మునిగిపోతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. సీలింగ్ పైపులను వాళ్లే తొలగించి నీరు లోపలకు వచ్చిందన్నారు. పంటలకు నిప్పు పెట్టి తెదేపా చేసిందని చెబుతున్నారు.’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.