తమ డిమాండ్ల సాధన కోసం అన్నదాతలు చేపట్టిన మహా పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. దిల్లీలోని కిసాన్‌ఘాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించడంతో పాటు బాష్ప వాయువు, జల ఫిరంగులను ప్రయోగించడాన్ని విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. గాంధీజీ స్ఫూర్తిని గాంధీ జయంతి నాడే తుంగలో తొక్కడం దారుణమన్నారు. అహింసా మార్గాన్ని ప్రపంచానికి చాటిన గాంధీ ఆశయాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. జైజవాన్‌.. జైకిసాన్‌ అని నినదించిన లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి రోజే రైతులపై లాఠీఛార్జ్‌ చేశారన్నారు.

modi 02102018 2

రైతుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. కేంద్రం, యూపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లాఠీ ఛార్జిని దారుణమైన పోలీస్‌ చర్యగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారు. దిల్లీ సుల్తాన్‌ అనే ద్రావణాన్ని సేవించారంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అహింసా దినోత్సవమైన గాంధీ జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో రైతుల గోడు కనీసం ఆలకించకుండా వారిపై దారుణంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. అన్నదాతలపై లాఠీఛార్జి ఘటన మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని మరోసారి చాటిచెప్పిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.

modi 02102018 3

మరో పక్క అన్నదాతలు శాంతించలేదు. కేంద్రం ఇచ్చిన హామీను రైతు ప్రతినిధులు తోసిపుచ్చారు. ప్రభుత్వ స్పందన తమకు సంతృప్తి కలిగించలేదని, తాము చేసిన డిమాండ్లన్నీ నెరవేరేంత వరకూ ఆందోళన ఆపేది లేదని తేల్చిచెప్పారు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. కాగా, దీనికి ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతుల్ని శాంతపరచేందుకు ఏం చేయాలన్న దానిపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, తదితరులతో సమాలోచనలు జరిపారు. అనంతరం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మీడియాతో మాట్లాడుతూ, రైతు ప్రతినిధులు హోం మంత్రితో సమావేశమయ్యారని, వారి డిమాండ్లపై చర్చించారని తెలిపారు. మెజారిటీ డిమాండ్లపై అవగాహన కుదిరందన్నారు. అయితే రైతు నిరసనలకు సారథ్యం వహించిన భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేష్ టికాయిత్ మాత్రం ప్రభుత్వ హామీలను రైతులు అంగీకరించలేదని, నిరసనలకు ఆపేది లేదని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read