ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎలాంటి బంధాలు లేవని, అసలు ఆయనకు కుటుంబ వ్యవస్థపై గౌరవమే లేదని, మోదీకి భార్య ఉందన్న విషయం ఎవరికీ తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ చెల్లదని తెలిసే చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇక చంద్రబాబును మోదీ తన ప్రసంగంలో పదేపదే లోకేష్ తండ్రి అనడంపై చంద్రబాబు స్పందిస్తూ ‘నన్ను లోకేష్ తండ్రి అన్నారు.. దానికి గర్వపడుతున్నా’ అన్నారు. మోదీ గురివింద చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము వ్యక్తిగత జీవితాలను వదులుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, రాష్ట్రానికి రావాల్సిన డబ్బును రాబట్టి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
'మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు' అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. జశోదా బెన్ భర్త మోడీ అని నేను సంబోధిస్తే తలకాయి ఎక్కడ పెట్టుకుంటారు అంటూ ఘాటుగా బదులిచ్చారు. "నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది." అని చంద్రబాబు అన్నారు.
న్యాయం చేయమంటే దాడి చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాము కూడా ఎదురుదాడి చేస్తామని అన్నారు. ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వనక్కర్లేదని, అంతకు ముందు ప్రధాని ఇచ్చిన హామీలను నిలబెడితే చాలన్నారు. ఆ పని కూడా మోదీకి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. తనకు, మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోదీ హయాంలో గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోస్తే.. రాజీనామా చేయాలని తానే డిమాండ్ చేశానన్నారు. అది మనసులో పెట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. లౌకిక దేశంలో హింసకు తావులేదని, అది మనసులో పెట్టుకుని మోదీ ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.