సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త మహితోక్తులు సదా స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే రంజాన్ మాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’ అని ముస్లింలు విశ్వసిస్తారని చెప్పారు.ఉపవాసాలు, దీక్షలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ..ఇవన్నీ ఖురాన్ బోధనల్లో ముఖ్యమైనవని చంద్రబాబు గుర్తు చేశారు. ముస్లింలు నెలరోజుల కఠోర ఉపవాస దీక్షలు ఆచరించారని ఆయన అభినందించారు.
ముస్లింలలో ప్రతి పేద కుటుంబం కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలన్నది తమ అభిమతమని, తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏటా చంద్రన్న రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిరాష్ట్రంలోని 13 జిల్లాలలో 12 లక్షల పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా అందజేశామన్నారు. ముస్లిం కుటుంబాల్లో అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులకు సామాజిక భద్రతా పెన్షన్లిస్తామని చెప్పారు. ఈ ఏడాది (2018-19) రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి 1101.90 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇమామ్స్కు, మౌజన్లకు వరుసగా నెలకు రూ.5000, రూ. 3000 గౌరవ పారితోషికం ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు 2016-17లో రూ. 32 కోట్లు కేటాయించగా, 2018-19 బడ్జెట్లో రూ.75 కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది నుంచి ‘చంద్రన్న పెళ్లికానుక’లో చేర్చిన ‘దుల్హన్ పథకం’ కింద ముస్లిం నవ వధువులకు రూ 50 వేల వంతున అందిస్తున్నామని, 2018-19లో ఈ పథకానికి రూ.80 కోట్లు కేటాయించాం. 16,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.