నేటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు అయిన సంగతి తెలిసిందే... 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తల అభినందనలు తెలిపేందుకు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. అలాగే చంద్రబాబు రాజకీయ జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. టీఎన్‌ఎస్ఎఫ్ కార్యకర్తలు తీసుకొచ్చిన కేక్‌ను సీఎం చంద్రబాబు కట్ చేశారు. తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు... ఎన్నో ఒడిదుడుకులతో 40 ఏళ్లు ముందుకు సాగానని గుర్తు చేసుకున్నారు.
ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి, దానికి అనుగుణంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల తర్వాతే దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్న బాబు సంస్కరణల గురించి మొదట గట్టిగా మాట్లాడింది తానే అని చెప్పుకొచ్చారు. తాను నిత్య విద్యార్థిని, దావోస్‌కు ఒక్కడినే వెళ్తున్నానన్నారు. మారుతున్న టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకోవాలని, పాత సిద్ధాంతాలనే పట్టుకొని కూర్చుకోవడం సరికాదన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే తన సిద్ధాంతమని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అమెరికాలో అందరూ క్రమశిక్షణగా ఉంటారని, సింగపూర్‌లాంటి దేశాల్లో క్రమశిక్షణ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు సరిగా ఉండేవి కాదని, ఎన్టీఆర్ కాలంలో పెద్ద ప్రాజెక్టులేవీ లేవని అన్నారు. ఎన్టీఆర్ మనందరికీ ఓ విజన్ నేర్పించారని చంద్రబాబు ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.