ఈ రోజు ప్రవేశపెపెట్టిన కేంద్ర బడ్జెట్ పై, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రం బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందని, ఏపి ప్రజల ఆకాంక్షని అసలు పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. చాలా రంగాలకు బడ్జెట్ లో స్థానం కల్పించలేదని, పేదల సంక్షేమం పూర్తిగా మర్చిపోయారని అన్నారు. సామాన్య ప్రజలకు భరోసా కల్పించటం, రైతులకు, మహిళలకు, యువతకు తోడ్పాటు అందించే అంశాలు లేవని అన్నారు. రాష్ట్ర సమస్యలు అయిన ప్రత్యెక హోదా, ఆర్ధిక లోటు వంటి అంశాలు విభజన చట్టంలో ఉన్నాయని, వాటిని అసలు పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఏమి ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశం పైనా స్పష్టత ఇవ్వలేదని, ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చూపించే వివక్ష కొనసాగుతూనే ఉందని చంద్రబాబు అన్నారు.
రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ పుడ్చాల్సి ఉంటే, రూ.4వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చారని, మిగిలినది ఇస్తామని, లేకపోతే ఇంతే ఇస్తామని, ఇలా ఏమి చెప్పలేదని, అసలు లోటు బడ్జెట్ పై కేటాయింపులు ఈ బడ్జెట్ లో లేవని అన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్‌ఆర్ తదితర విద్యాసంస్థల ఏర్పాటు బాధ్యత కేంద్రానిది అని, వీటికి ఈ బడ్జెట్ లో ఒక్క పైసా కూడా కేటాయించలేదని చంద్రబాబు అన్నారు. ఇక రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల కేటాయింపులు లేవని చంద్రబాబు అన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లు నిలిచిపోయి రెండు నెలలు అవుతున్నా, అటు కేంద్రం కాని, ఇటు రాష్ట్రం కాని పట్టించుకోవటం లేదని చంద్రబాబు అన్నారు. మరో పక్క మరో విభజన హామీ అయిన విశాఖ, విజయవాడ మెట్రోలతో పాటు కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాల పై అసలు ప్రస్తావనే లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే డిజిటల్ చెల్లింపుల పై వేస్తున్న పన్ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించటం మంచి విషయమని, డిజిటల్ చెల్లింపులకు కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు మేమిచ్చిన సిఫార్సుల్లో ఇదే కీలకం అని, దాన్ని ఇప్పటికైనా అమలు చేసినందుకు ప్రజలకు మేలు చేస్తుందని చంద్రబాబు అన్నారు.