ప్రధాని మోదీ వల్లే కియా మోటర్స్ అనంతపురానికి వచ్చిందంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. తన వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని తేల్చి చెప్పారు. మోదీకంటే తనను నమ్మి ఏపీకి వచ్చిందని స్పష్టం చేశారు. కియాను గుజరాత్ తీసుకెళ్లాలని మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. తనను నమ్మి.. కియా మోటార్స్ ప్రతినిధులు ఏపీకి వచ్చారని.. మోదీని కాదని కుండబద్ధలు కొట్టారు. తనపై నమ్మకంతో ఒక్క మాట అడిగితే.. 50వేల కోట్ల రూపాయల విలువ చేసే 35వేల ఎకరాలను రైతులు ఇచ్చారన్నారు. ప్రధాని అమరావతికి వచ్చి గుప్పెడు మట్టి, నీళ్లు ఇచ్చారని.. ఆ మట్టి, నీళ్లను ముఖాన కొడతామని హెచ్చరించారు. ఏటా ఆరు వేల కోట్ల రూపాయల పన్నులు కడుతున్నామని.. ఎవడబ్బా సొమ్మని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
ఇదే విషయం పై ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు స్పందించారు. కియా పరిశ్రమ రాష్ట్రానికి రాకపై మోదీకి కితాబివ్వడం జగన్ మరో సెల్ఫ్ గోల్ అని, ఆయన మోదీ భజన భాజపా నేతలనే మించిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కియా తన వల్లే వచ్చిందని చెప్పే సాహసం మోదీనే చేయలేదని గుర్తు చేశారు. రోజురోజుకూ జగన్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాడని మండిపడ్డారు. కార్యకర్తలు, నాయకుల్లో గెలుపుపై ఇంకా పట్టుదల రావాలని కోరారు. ఇకపై ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోజువారీ కార్యాచరణ సిద్ధం చేసుకొని, పనితీరును విశ్లేషించుకోవాలని దిశానిర్దేశం చేశారు. తుది ఓటర్ల జాబితా విడుదలైనందున అన్ని ఓట్లు తనిఖీ చేసుకోవాలని కోరారు. ఇటీవల ఓట్ల దొంగల ఎత్తులు చిత్తు చేశామని, భవిష్యత్లో ఈవీఎం దొంగలను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని, గత ఎన్నికలకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చిన వారికే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వైకాపా మైండ్, సైకో గేమ్లను చిత్తు చేయాలన్నారు. ఏపీకి చెందిన రూ.లక్ష కోట్ల ఆస్తులు లాక్కున్న కేసీఆర్తో జగన్ దోస్తీ కట్టారని, పోలవరంపై పదేపదే కేసులు వేసే తెరాసకు వైకాపా మద్దతు పలుకుతోందని మండిపడ్డారు. జగన్ ఆస్తులు, బంధువుల ఆస్తుల కోసం కేసీఆర్కు రాష్ట్రం తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ‘ఈ ఒక్కసారే ప్లీజ్’ అంటే, క్రూరమృగం చెంతకు ఎవరైనా వెళ్తారా అని ప్రశ్నించారు. తప్పులు చేసేవారికి ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. తండ్రికి అవకాశం ఇస్తేనే ఉమ్మడి రాష్ట్రాన్నే ఏకంగా మింగేశాడని, ఇతనికి మళ్లీ అధికారం ఇస్తే ఇక జనాన్ని బతకనిస్తాడా? అని తూర్పారపట్టారు. తెదేపా మిషన్ 150 ప్లస్ ఏకపక్షం కావాలని, 25 ఎంపీ సీట్లు, 150పైగా అసెంబ్లీ సీట్లు తెదేపా సాధించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.