బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. ఆ నాలుగు పార్టీలు టీడీపీనే టార్గెట్ చేశాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నారని అన్నారు. తితలీతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క బీజేపీ నేత పరామర్శించడానికి రాలేదని మండిపడ్డారు. పైగా పక్క రాష్ట్రం తాజా మాజీ మంత్రి కేటీఆర్.. పవన్‌కల్యాణ్‌ను అభినందించారని, రాజమండ్రిలో కవాతు బాగా చేసి, చంద్రబాబుని బాగా తిట్టారని ప్రశంసించారని, ఇదేమి రాజకీయం అని అన్నారు.
మరో పక్క జనసేన కవాతు, టీవీల్లో లైవ్ వెయ్యాలి అంటూ, రాం మాధవ్ ఫోన్లు కూడా చేసారని, టిడిపి నాయకులు చెప్పటంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. వీళ్ళందరూ కలిసి, ఏం సాధిస్తారు ? మన పై ఇంత కక్ష చూపించే బదులు, ప్రజలకు చెయ్యాల్సినవి చెయ్యచ్చు కదా, ఎక్కడ కేటీఆర్, ఎక్కడ రాం మాధవ్, ఎక్కడ పవన్, అందరూ కలిసి మన పై దాడి చేస్తున్నారని అన్నారు. తితలీ తుఫానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదన్నారు. వీళ్లంతా కలిసి పని చేస్తున్నారని చెప్పడానికి ఇవే రుజువులు అని పేర్కొన్నారు.
బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీలు టీడీపీనే టార్గెట్ చేస్తున్నాయని.. అదంతా మనకే లాభమని వివరించారు. వాళ్లే తిట్టే తిట్లే మనకు ప్రజా దీవెనలన్నారు. ప్రజాభిమానమే తెలుగుదేశానికి నైతిక బలంగా అభివర్ణించారు. ఇందుకోసం తానొక్కడినే కష్టపడితో కుదరదని, పార్టీ మొత్తం కష్టపడితే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి బాగా పెరుగుతుందని సూచించారు. తితలీ బాధితులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాభిమానం ప్రభుత్వంపై ఉందన్నారు. అది ఓర్వలేకే ప్రత్యర్థి పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని తెలిపారు. ప్రజలకు మనలను దూరం చేయాలని విపక్షాలు కుట్రలు చేస్తుంటే.. ప్రజలు మనస్ఫూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.