పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘనేనని, మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని వ్యవస్థలనూ మోదీ నాశనం చేశారని, తాజాగా ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.
"ప్రధాని తన వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ద్రోహం తలపెడుతున్నారు. ప్రధాని హోదాను దిగజార్చుతున్నారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలకు ఇది పరాకాష్ట. అయినా, ఓ రాష్ట్ర శాసనసభ్యులు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం దేశ ప్రధాని స్థాయికి తగిన విషయం కాదు. ఇది కచ్చితంగా అనైతిక వ్యవహారమే! ఎన్నికల సంఘం నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలా? ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ప్రధానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది శాసనసభ్యులు భాజపాతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వెల్లడికాగానే వారు తమవైపు వచ్చేస్తారన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సీరామ్‌పుర్‌లో సోమవారం ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మోదీ మాట్లాడుతూ..‘దీదీ, మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అన్నిచోట్లా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని విడిచి వెళ్లిపోతారు. ఇప్పటికే మీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు’ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రభుత్వాన్ని నడిపించడం కష్టంగా మారనుందని హెచ్చరించారు. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజలను దారుణంగా మోసగించారని, ఈ ప్రభుత్వం అవినీతిమయమైందని దుయ్యబట్టారు. ‘దేనికి అనుమతి, అడ్మిషన్ ఇవ్వాలన్నా ప్రజలు డబ్బులు చెల్లించాల్సిందే. దాన్ని వ్యతిరేకించిన వారిని మమత ప్రభుత్వం శిక్షిస్తుంది’ అని విరుచుకుప్డడారు.