శనివారం నాడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ సంబంధాల పై మాట్లాడారు. ఈ సందర్భంగా, ఒక తెలుగువాడు ఓ బ్యూటీఫుల్ ట్వీట్ చేశాడు. ‘అవును.. అసెంబ్లీ వదిలేసి ప్రజా సమస్యలు పట్టకుండా, కేసీఆర్ తో చెట్టాపట్టాల్ వేసుకుని హైదరాబాద్ లో ఉంటూ, వారానికి నాలుగు రోజులు మార్నింగ్ వాక్ చేస్తూ, బీజేపీ చెప్పినట్టు నాటకాలాడుతూ, కేసుల మాఫీ కోసం మోదీ చుట్టూ తిరుగుతూ, తుపాన్ బాధితులను పరామర్శించేందుకు కూడా మనసు రాని లక్షకోట్ల దోపిడీదారు.. దగ్గరి రాష్ట్రాన్ని పసిబిడ్డలా సాకుతున్న చంద్రబాబు పరిపాలనంటే ఏమిటో నేర్చుకోవాలోయ్, కలికాలం అంటే ఇదే మరి! కేసీఆర్ ‘తాన’ అంటే జగన్ ‘తందానా’ అనకపోతే మోదీకి కోపం రాదు?’ అని ఆ ట్వీట్ ను చదువుతూ చంద్రబాబు నవ్వులు చిందించారు.
మోదీ కోసం వీళ్లందరూ కలిసి పనిచేస్తున్నారని, ఇది కామన్ మ్యాన్ స్పందన. ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలోని ఓ ట్వీట్ ని చంద్రబాబు చదివి వినిపించారు. ‘అక్కడ మొక్కుడు, ఇక్కడ మొరుగుడు, ఫామ్ హౌస్ లో తాగుడు..’ అంటూ ఆ ట్వీట్ ని చదివారు. నిన్న కేసీఆర్ తనపై దారుణంగా మాట్లాడారని.. ఇది మంచి పద్ధతి కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అమరావతిలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హుందాతనం లేకుండా, పద్ధతి లేకుండా అసభ్యకరమైన భాష మాట్లాడారని, దీనిని ఖండిస్తున్నానని అన్నారు. ఇంత హుందాతనం లేకుండా మాట్లాడటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని అన్నారు.
తానెప్పుడూ పద్ధతి లేని రాజకీయాలు చేయలేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, ఎప్పుడూ హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తననే కాదు, కాంగ్రెస్ పార్టీని, మోదీపైనా కేసీఆర్ దారుణంగా మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. రాజకీయాల్లో కొంత హుందాతనం, విలువలు ఉంటాయని, అధికారంలో ఉండే వ్యక్తులు చాలా హుందాగా వ్యవహరించాలని సూచించారు. నాగరిక ప్రపంచం ఆయన తీరును మెచ్చుకోదని, నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు.