నేను కూత పెడితేనే, ఈ లోకం అంతా నిద్ర లెగుస్తుంది అనుకుంటుంది అంట కోడి... అలాగే నేను ప్రచారం చెయ్యబట్టే, అందరూ గెలిచారు అని చెప్తున్న పవన్ కళ్యాణ్, మరింత శ్రుతిమించి చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కనిపిస్తే, కర కర తినేస్తున్నారని, ఇలా ఎలా తినాలో చంద్రబాబే నేర్పిస్తున్నారని, చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న 40 ఏళ్ళ అనుభువం ఇసుకను దోచేయ్యటానికి తప్ప, దేనికి ఉపయోగపడటం లేదని, హేళనగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై ముఖ్యామంత్రి చంద్రబాబు స్పందించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనని ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటల పై స్పందించారు..
నా 40 ఏళ్ల అనుభవంతో ఇసుక ఎక్కడెక్కడో అమ్ముకోవడానికి పనిచేస్తున్నానని పవన్‌కళ్యాణ్ అంటున్నారు. ఇసుక కావాల్సిన వారికి ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చే రూ.500-600 కోట్లను వదులుకున్నాం. ఎవరైనా ఎక్కడైనా అడ్డుపడితే తిరగబడి ఉచితంగా తీసుకెళ్లమంటున్నాం. అంతేకానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తామంటే కుదరదు. మీ దగ్గర ఆ శక్తి ఉండి... మనుషులను పెట్టి ఎక్కడైనా.. ఎవరైనా తప్పు చేస్తే ఎదిరిస్తే... నేను సహకరిస్తా. అంతేకానీ రాజకీయం చేయవద్దు. నీతివంతమైన సుపరిపాలన ఇస్తూ... సాంకేతిక సహకారంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మాపై నిందలేస్తారా? అంటూ చంద్రబాబు మాట్లడారు...
ప్రత్యేక హోదాపై వీలైతే పవన్ భాజపాతో మాట్లాడాలి. కేంద్రంపై పోరాడాలి. ఇవన్నీ చూస్తుంటే ఓ వైపు ఆవేదన..మరో వైపు బాధ వేస్తుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. 2004లో తెదేపా ఓడిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. అదే 2014లో రాష్ట్ర విభజనకు దారి తీసింది. మళ్లీ తెదేపా ప్రభుత్వం కొనసాగితే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి...’ అని చంద్రబాబు వెల్లడించారు. ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా డిగ్రీ చదివిన నిరుద్యోగులకు రూ.వెయ్యి నిరుద్యోగభృతి ఇస్తున్నానని, అదీ వారిపై తనకున్న అభిమానమని చెప్పారు. అందరినీ రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి, అస్థిరత సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. పురావస్తు శాఖను ప్రయోగించి తిరుమల ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందన్నారు. ‘‘వెంకటేశ్వర స్వామిపైనా కేంద్రం రాజకీయం చేస్తోంది. రమణ దీక్షితుల ద్వారా నాపై విమర్శలు చేయిస్తున్నారు. వెంకటేశ్వరస్వామి పవర్‌ఫుల్ దేవుడు. ఎవరితోనైనా పెట్టుకోండి. వెంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు’’ అని హెచ్చరించారు.