వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా ఎక్కడైనా ఉపఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్న పార్టీలే గెలుస్తుంటాయని...భాజపా ఓడిపోవడం ఆ పార్టీ పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా భావించాలని చెప్పారు. వారి పరిపాలనలో ప్రజలు ఎంత నిరాశ, నిస్పృహలతో ఉన్నారో చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతుంటాయని వ్యాఖ్యానించారు. విభజనహామీలు, చట్టంలోని అంశాల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం చివరి అస్త్రం మాత్రమేనని... వీటి సాధనకు రాజకీయ పరిష్కారమే ముఖ్యమని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని ప్రజలంతా ఒకే దారిలో నడిచి ఏకపక్షంగా తమకు మద్దతివ్వాలన్నారు. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జాతీయ రాజకీయాల్లో నాయకత్వం వహిస్తారా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు... ‘నేషనల్ ఫ్రంట్ పెడతా.. యునైటెడ్ ఫ్రంట్ పెడతా. నేనే ప్రధాన మంత్రిని అవుతా... అని నేను అన్నాననుకో... నీకు ఆనందం. నువ్వే రేపు వీడు ఒక ఫూల్..బఫూన్ అని రాస్తావు..’ అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అలాగే పలు ప్రశ్నలకు స్పందిస్తూ... ‘ నేను సైనికుడి మాదిరిగా పనిచేస్తాను. రాష్ట్రాలను బలోపేతం చేసుకోవాలనేదే నా ఉద్దేశం. జాతీయ రాజకీయాల్లో ఎవరికీ పోటీదారును కాను. రాబోయే రోజుల్లో కేసీఆర్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయ్‌క్ ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. ప్రాంతీయ పార్టీల కూటమి విషయంలో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీల కూటమి ఎన్నికలకు ముందా? తర్వాత ఎలా కార్యారూపం దాల్చుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు అన్నారు.
రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇవ్వటం పై, విమర్శలు వస్తున్నాయి కదా అని విలేకరి అడగగా, కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్‌గాంధీతో కరచాలనం చేయడంలో తప్పేముంది. మోదీ, సోనియాగాంధీతో నాకు వ్యక్తిగత విరోధాలు ఏమీ లేవు. కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో... భాజపా కూడా రాష్ట్రానికి అంతకంటే ఎక్కువే చేస్తుంది...’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల మనోభావాలతో జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయి. అవి వారికి ఆటకావొచ్చు. మనకు జీవన్మరణ సమస్య. అలాంటి పరిస్థితి సృష్టించి నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోమనడం ఏం పద్ధతి... ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నవి సాధించుకోవడం ఎలాగో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీలకు ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయి. మన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీలన్నీ మద్దతు తీసుకుని విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతాం. ’ అని సీఎం చంద్రబాబు అన్నారు.