ఫొని’ తీవ్ర పెను తుపానుగా మారుతున్న నేపథ్యంలో నాలుగు ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ తుపాను ప్రభావం అధికంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హై అలర్ట్ ఉందని.. తక్షణ చర్యలు తీసుకొనేందుకు కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని చంద్రబాబు కోరారు. అలాగైతే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేతలు యుద్ధప్రాతిపదికన స్పందించేందుకు వీలు కలుగుతుందని సీఎం లేఖలో తెలిపారు.
ఫని తుఫాన్ నేపథ్యంలో నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి గురించి, రాష్ట్ర సీఈసీని విలేకరులు ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నుంచి తమకెలాంటి ప్రతిపాదనలు రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది షాక్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తమకెలాంటి ప్రతిపాదనలు వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాని చెప్పారు. ఎన్నికల కోడ్ మినహాయింపు వంటి కీలక నిర్ణయాలు ఈసీనే తీసుకుంటుందని.. ఈసీ ఆదేశాలే తాము అమలుచేస్తామని చెప్పారు. ఇక తుఫాన్ ప్రభావం వల్ల స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం వంటి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కలెక్టర్లను ముందస్తు చర్యల కోసం అప్రమత్తం చేసినట్టు తెలిపారు.
ఏపీలోని ఆ నాలుగు జిల్లాలతో పాటు ఒడిశా, కొంతమేర పశ్చిమ బెంగాల్ మీద ఫణి తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉంది. అది తీవ్ర తుఫాన్‌గా మారుతుందని, తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, వాతావరణ శాఖతో పాటు ఆర్టీజీఎస్ అధికారులు కూడా తెలిపారు. దీంతో అధికారులకు సరైన మార్గనిర్దేశం చేయడానికి అనువుగా కోడ్‌కు రిలాక్సేషన్ ఇవ్వాలని కోరారు. మరోవైపు తుఫాన్ కారణంగా టీడీపీ సమీక్షలను రెండు రోజులు వాయిదా వేసింది.