రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల మందు వరకు శత్రువులుగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మిత్రులు అవుతుంటే, మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులు అవుతున్నారు. ఎన్నికల ముందు, బీజేపీ పార్టీ, వైసీపీ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని విధాలుగా సహాయ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ, పార్టీ, వైసీపీ పాలన నచ్చక, వారి పై విమర్శలు చెయ్యటం ప్రారంభించింది. బెజేపీకి కేవలం ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉండటంతో, వైసీపీని ఎదుర్కునే శక్తి లేక, పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా ఈ ప్రకటన కూడా చేసారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ఈ కలియక వైసీపీకి అస్సలు మింగుడు పడటం లేదు. మొన్నటి దాక తమకు లోపాయికారకంగా మద్దతు తెలిపిన, బీజేపీ ఇప్పుడు తమకు దూరం అవుతుందని, ఢిల్లీ లెవెల్ లో చేసే లాబయింగ్ కు ఇది ఇబ్బంది అవుతుందని, వైసీపీ పార్టీ భావిస్తుంది.
అయితే ఇదే తరుణంలో, తెలుగుదేశం పార్టీ ఆచితూచి స్పందిస్తుంది. ఇప్పటికప్పుడు ఈ కలియిక వల్ల తమకు ఇబ్బంది ఏమి లేదని టిడిపి భావిస్తుంది. అయితే బీజేపీ - జనసేన కలియిక పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి సారిగా స్పందించారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గున్నారు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు, బహిరంగ సభలో ఈ విషయం పై స్పందించారు. రాజధాని అమరావతిని తరలిస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, కనుక, జనసేన-బీజేపీ కూటమి కలిసి పోరాటం చేస్తే, ఈ రెండు పార్టీల కలయికని తాము కూడా స్వగిస్తామని అన్నారు. ఎన్నికలు, ఓట్లు ఇప్పుడు ప్రాధాన్యం కాదని, ఈ దిశగా అన్ని పార్టీలు ఆలోచించాలని అన్నారు.
"పవన్ కల్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, సంతోషం. అమరావతిని కొనసాగించడానికి మీ పొత్తును ఉపయోగిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కానీ జగన్ అరాచకాలకు మీరు కూడా భయపడిపోయి, పోరాడకపోతే ఉపయోగంలేదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు ముందు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా, ఇవే వ్యాఖ్యలు చేసారు. బీజేపీ-జనసేన కలయిక రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తుందన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని, కేంద్రంలో ప్రభావితం చేయగలస్థానంలో ఉన్న బీజేపీ రాజధాని మార్పు అంశంలో పెద్దన్నపాత్ర పోషించాలని అమరావతి ఉద్యమకారులతో పాటు, ఆంధ్రులంతా విశ్వసిస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. బీజేపీ-జనసేన కలయిక కేవలం భేటీలకే పరిమితం కాకుండా, ఇప్పటికైనా ప్రత్యక్షకార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆకాంక్ష రాష్ట్రమంతటా ఉందన్నారు.