తనకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మభూమి-మాఊరు గ్రామసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. అక్కడ మాట్లాడుతూ, ఎలాంటి విమర్శలు పట్టించుకోకుండా, దగాపడ్డ ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నానన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడగడుతున్నానన్నారు. అదృష్టం కలిసివచ్చి ప్రధాని అయ్యారని, మనపై కుట్ర పన్నారని విమర్శించారు. తన కుటుంబం పై ప్రధాని మోడీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
నా కుటుంబ సభ్యులు హెరిటేజ్‌ను ఒక పద్దతి ప్రకారం నడిపిస్తున్నారన్నారు. డబ్బుల కోసం ఇబ్బందిపడకుండా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. కంపెనీలు చూసుకోమని తాను లోకేష్‌కు సూచించానన్నారు. కాని లోకేష్ రాజకీయాల్లోకి వస్తానని, ప్రజా సేవ చేస్తాను అని కోరటంతో, ఇటు వైపు వచ్చారని అన్నారు. తాను బాగా పని చేస్తే, ప్రజలు ఆదరిస్తారాని, ఏ రాజకీయ నాయకుడుకి అయినా అంతే అని అన్నారు. ‘‘రాష్ట్ర పరిధిలో ఉండే కోడి కత్తి కేసుపై ఎన్ఐఏ ఎంక్వైరీ వేశారు. గుజరాత్ అల్లర్ల కేసులో నాడు సీబీఐ విచారణను మోదీ అడ్డుకున్నారు. నా కుటుంబ సభ్యులు హెరిటేజ్‌ను పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారు. కంపెనీలు చూసుకోవాలని లోకేష్‌కు సూచించా. ప్రజాసేవ కోసం రాజకీయాలకు వస్తానని లోకేష్ చెప్పారు. నా కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరం. నాకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదు. హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. రేపు మరోసారి ఢిల్లీ వెళ్తా.. ఇతర పార్టీల నేతలను కలుస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.
విభజన హామీలు అమలు చేయకపోవడంతో పాటు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా నమ్మకద్రోహానికి పాల్పడటం వల్లే తాము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నప్పటికీ కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి కేసులో కావాలనే కేంద్రం జోక్యం చేసుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తుంటే ఐటీ, సీబీఐ దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిన్న మోడీ మాట్లాడుతూ, చంద్రబాబుకి ప్రజా సేవ తెలియదని, కేవలం కొడుకు కోసమే రాజకీయాలు చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే.