తాను ఎక్కడ ఉన్నా తెలంగాణ తనకు ప్రియప్రాంతమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనను తెలంగాణ ప్రజలంతా ఎంతో అభిమానించారని, ఎవరికీ దక్కని గౌరవం తనకు ఇచ్చారని.. దాన్ని ఎప్పుడూ మరిచిపోలేనన్నారు. 37 ఏళ్లుగా కాంగ్రెస్, తెదేపా ఒకరిపై మరొకరు పోరాటం చేసినా దేశ ప్రయోజనాల కోసమే ఈ రోజు ఏకమయ్యామన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే.. తనపై కేసీఆర్, తెరాస చేసిన విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. నేను నీళ్ళు ఆపుతున్నా అని కేసీఆర్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది, పైన తెలంగాణా ఉంది, తెలంగాణా వదిలిన నీటినే, ఏపి వాడుకుంటుంది, మరి నేను తెలంగాణాకు నీళ్ళు ఎలా ఆపుతాను అంటూ, ఒక్క సమాధానంతో, కేసీఆర్ నోరు ముపించారు చంద్రబాబు.
‘‘నేనేదో పెత్తనం చేస్తానంటున్నారు. ఈ రోజు నేను తెలంగాణకు వచ్చి పోటీచేసే అవకాశం లేదు. నేనే ఏపీకి సీఎంగా ఉంటాను. తెలంగాణలో ప్రజల అభ్యున్నతికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నా. గోదావరి జలాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలనేది ఆనాడు ఆలోచించాం. కృష్ణానదిలో నీళ్లు రాలేదు. గోదావరి 2500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. దాన్ని ఉపయోగించుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయి. తెలంగాణ కింద ఉన్న ఏపీ నీళ్లకు అడ్డు పడుతోందని మాట్లాడటం ఎంతవరకు సబబు? దేవాదుల, మాధవరెడ్డి ఎత్తిపోతల, భీమ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు నేనే నాంది పలికాను. తెలుగుజాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తా. విద్యకు నేనే ప్రాధాన్యమిచ్చాను. హైదరాబాద్‌ను నేనే నిర్మించాని చెప్పుకొంటున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని ఎక్కడా అనలేదు. సైబరాబాద్‌ను నేనే నిర్మించా’’ అని చంద్రబాబు వివరణ ఇచ్చారు.
‘‘ఎన్డీయే పాలనతో ప్రజలకు లాభం వచ్చిందా? పెద్ద నోట్ల రద్దుతో లాభం వచ్చిందా? ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయా? బ్యాంకుల్లో కరెన్సీ ఉందా? దానికి కారణం ఎన్డీయే కాదా? జీఎస్టీ తీసుకొచ్చి అమలు సరిగా చేయలేదు. దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూపాయి విలువ పడిపోయింది. రైతులు, పేదలు ధరలు పెరుగుదలతో అవస్థలు పడుతున్నారు. పద్ధతి ప్రకారం ఆలోచించకుండా దేశహితం గురించి ఆలోచించకుండా స్వార్థంతో పనిచేస్తున్నారు. ముస్లిం సోదరుల పట్ల అసహనంతో వ్యవహరించి అభద్రతా భావంతో ఉన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆవేశాలు ఉన్నాయి. విభజన జరిగినా, జరగకపోయినా తెలుగు జాతి కలిసి ఉండాలని ఆనాడే చెప్పాను. సమన్యాయమని చెప్పాను తప్ప ఏకపక్షంగా విభజన చేయాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణలో కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదు. ఇవన్నీ తెరాస అడగకపోవడం న్యాయమా? నేనెక్కడున్నా తెలంగాణ నాకు ప్రియప్రాంతమే’’ అని చంద్రబాబు అన్నారు.