ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నాం కానీ.. కేంద్రం నుంచి వాటిల్లుతున్న నష్టాలను నివారించలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి తీసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను ఒక రాజకీయ బాధిత రాష్ట్రంగా మారుస్తున్నారని కేంద్రం తీరుపై మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను ఒక రాజకీయ బాధిత రాష్ట్రంగా మార్చారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. ఇదే విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా, సమర్ధవంతంగా 15వ ఆర్థిక సంఘానికి తెలియజెప్పాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 11న జరగనున్న 15వ ఆర్థిక సంఘం సమావేశంలో సభ్యుల ముందు ఏఏ అంశాలను ప్రస్తావించాలనే విషయంపై శుక్రవారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు నంద్‌కిశోర్ సింగ్ అధ్యక్షునిగా వున్న 15వ ఆర్థిక సంఘం ఆర్థిక కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విని వినతులు స్వీకరించేందుకు రాష్ట్రానికి వస్తోంది. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో అశాస్త్రీయ రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన వైనాన్ని, ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అందరికీ అర్ధమయ్యేలా కూలంకుశంగా విడమరచి చెప్పాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కొత్త ఆర్థిక సంఘం వైఖరి ఏమిటో గట్టిగా నిలదీయాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకు ఇంతకు మించిన సందర్భం మరొకటి లేదని అభిప్రాయపడ్డారు. ‘నిజానికి నీతిఆయోగ్ డమ్మీగా మారింది, ప్రణాళికా సంఘాన్ని తీసేశారు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టరు, ఇక రాష్ట్ర సమస్యల్ని చెప్పడానికి ఒక ఫోరం అంటూ ఏదీ లేదు. ఈ పరిస్థితులలో 15వ ఆర్థిక సంఘాన్ని మించిన వేదిక మనకు దొరకదు అని ముఖ్యమంత్రి అన్నారు.
‘14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంది. ఇప్పుడీ అంశాన్ని ప్రస్తావించి కొత్తగా వీరేం చెబుతారో తెలుసుకోవాల్సి వుంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 1971 జనాభా ప్రాతిపదిక అంశాన్ని మార్చడం, ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకున్న వైనం, పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలనూ, పార్లమెంటులో ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా చేస్తున్న మోసం.. వీటినన్నింటినీ ఎండగట్టేలా మన వాదన ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే నిష్పత్తిని నిర్ణయించటానికి 2011 జనాభా గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘానికి నిర్దేశించడం పట్ల ఈ సమావేశంలో తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.