బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా ప్రస్తుతం తుఫాన్ గా మారి ఫణిగా నామకరణం చేసుకొని 45 కిమీ వేగంతో తీరంవైపు దూసుకొస్తోంది. తమిళనాడు, కోస్తాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షణకోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ‘ఫణి’ శనివారం సాయంత్రానికి చెన్నైకి ఆగ్నేయంగా 1,200కి.మీ. దూరంలో, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం నాటికి తీవ్ర తుఫానుగా, 29కల్లా అతి తీవ్ర తుఫానుగా బలపడనుంది. ఈ క్రమంలో రానున్న మూడు రోజులు శ్రీలంక తీరం వెంబడి వాయవ్య దిశగా పయనించి 30న సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30నుంచి 31డిగ్రీలు వరకు ఉండటం తుఫాను బలపడేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అతి తీవ్ర తుఫానుగా బలపడే క్రమంలో దాని పయనం మందగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 30 సాయంత్రానికి ఫణి తుఫాను దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది. తుఫాను దిశ మార్పు ఖాయమని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్లు దిశ మార్చుకుని బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళుతుంటాయన్నారు. 2016లో ‘రోనూ’ తుఫాను తీరం వెంబడి పయనించి బంగ్లాదేశ్ వైపు వెళ్లిందని గుర్తుచేశారు.
అతితీవ్ర తుఫాను తీరానికి దగ్గరగా వస్తే ఈనెల 30, మే 1వ తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. ఒకవేళ తీరానికి దూరంగా తుఫాను దిశ మార్చుకుంటే మాత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో ఒక మోస్తరు వర్షాలే కురుస్తాయి. ఈనెల 29నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడతాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లినవారు వెంటనే తీరానికి రావాలని సూచించింది. కాగా, తుఫాన్ దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనించే క్రమంలో భూమి నుంచి తుఫాను దిశగా గాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాలో ఎండలు పెరిగి కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇదిలాఉండగా, గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో శనివారం 2వ నంబరు ప్రమాద సూచికను జారీ చేసినట్లు పోర్ట్ కన్జర్వేటర్ వెంకటేశ్వరరావు తెలిపారు.