రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... పలు సీట్ల విషయంలో ఇప్పటికే అభ్యర్థులను క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు సీటు ఖరారైందని... ఆయా నేతలు మీడియాలో ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇది కొంతమంది ఆశావాహుల అసంతృప్తికి కారణమవుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు విషయంలోనూ ఇలాంటి పంచాయతీనే నడుస్తోంది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్... ఇక్కడి నుంచి తన కుమార్తె షబానా ఖాతూర్‌కు టికెట్ ఇవ్వాలని కోరడం... ఇందుకు చంద్రబాబు ఓకే చెప్పడం జరిగిపోయాయి.
అయితే ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేత నాగుల్ మీరా... జలీల్ ఖాన్ కుమార్తెకు టీడీపీ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు. తనకు కాకుండా జలీల్ ఖాన్ కూతురికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆయన పార్టీ ముఖ్యనేతల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్న నాగుల్ మీరా... త్వరలోనే తన పదవికి, పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం కూడా జరిగింది. దీంతో నాగుల్ మీరాను వెంటపెట్టుకుని చంద్రబాబును కలిశారు ఎంపీ కేశినేని నాని. అయితే విజయవాడ పశ్చిమ సీటును నాగుల్ మీరాకు ఇవ్వాలని ఎంపీ నాని కూడా చంద్రబాబును కోరారని కొందరు చర్చించుకుంటున్నారు.
మరికొందరు మాత్రం నాగుల్ మీరాను ఎంపీ నాని బుజ్జగించి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారని చెబుతున్నారు. మొత్తానికి విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డ నాగుల్ మీరా... చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడతారా లేక పార్టీని వీడతారా అన్నది చూడాలి. పార్టీ వీడేందుకు నాగుల్ మీరా సమావేశం ఏర్పాటు చేశారంటూ వార్తలు వచ్చాయి.. అయితే వాటిని నాగుల్ మీరా తోసిపుచ్చారు. అసంతృప్త ఉన్న మాట వాస్తవమేనని, కానీ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. అధినేత ప్రకటించకుండా జలీల్ ఖాన్ సొంతంగా సీటు ఎలా ప్రకటించుకుంటాంటూ ప్రశ్నించారు. బోండా ఉమ, గద్దె రామ్మోహన్ ప్రకటించుకోలేదే అంటూ నిలదీశారు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటిస్తే తమతో ముందుగా మాట్లాడి, వారితో కలిసి పని చేయాలని చెప్పేవారని, ఇంత వరకూ అటువంటి పిలుపు ఆయన నుంచి రాలేదన్నారు. అధినేత సీటు ఇస్తే పోటీ చేస్తానని, లేకుంటే పార్టీలోనే కొనసాగుతానని నాగుల్ మీరా చెప్పారు.