40 ఏళ్ళ వైఎస్ ఫ్యామిలీ చెయ్యలేనిది, 4 ఏళ్ళ చంద్రబాబు పాలన చేసింది అంటున్నారు పులివెందుల ప్రజలు. పులివెందులలో ‘చింతల పంట‘ చీనీని చిగురింపజేసిన ఈ అద్భుతం.. కృష్ణాజలాల రాకతో సాధ్యమయింది. ఒకనాడు చీనీతోటల (బత్తాయి)సాగంటే రైతులకు కత్తిమీద సాములా ఉండేది. ఐదేళ్లపాటు కన్నబిడ్డలకంటే మిన్నగా చూసుకొనేవారు. ఫలసాయం వచ్చేసమయానికి బోరులో నీరు ఉండేది కాదు. దీనికోసం లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు వేసేవారు. ఆ బోర్లు పడక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కడప జిల్లా పులివెందుల పరిధిలో కోకొల్లలు. ఇప్పుడు కృష్ణాజలాల రాకతో ఈ కన్నీటి కథకు తెరపడింది. గండికోట డ్యామ్ నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. భూగర్భం దాహం తీర్చింది. దీంతో నీటితావుల కోసం వెతుకులాటలోనే సగం పంటకాలం గడిచిపోయే చీనీ రైతుల సాగు చరిత్రలో ఇప్పుడు కొత్త అంకం మొదలయింది.
నాడు ప్రధానంగా బోర్లు మీదనే ఆధారపడిన స్థితి నుంచి, ఈనాడు అవి అవసరమే లేని పరిస్థితికి పులివెందుల రైతులు చేరుకొన్నారు. ఉద్యానవన పంటలకు పులివెందుల నియోజకవర్గం పెట్టింది పేరు. అరటి, చీనీసాగు చేసి ఈ ప్రాంత రైతులు మిగిలిన ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు. ఇంత గిరాకీ ఉన్నా, చీనీ తోటల విస్తీర్ణం అంతకంతకూ తగ్గుకుపోయింది. నాలుగైదు సంవత్సరాల క్రితం దాదాపు 20 వేల హెక్టార్లలో చీనీ తోటలు ఉండగా ఇప్పుడు 13 వేల హెక్టార్లలోనే సాగు చేస్తున్నారు. వరుస కరవులు, వర్షాభావం కారణంగా గర్భ జలాలు అడుగంటిపోవడంతో దాదాపు ఏడు వేల హెక్టార్లలో తోటలు ఎండిపోయాయి. లక్షల్లో ఖర్చు పెట్టుకొని, పదే పదే బోర్లు వేసుకొంటూ ఉండటం వల్ల తప్ప మిగతా తోటలూ దక్కేవి కావు. వందల అడుగుల లోతు బోరు తవ్వడం.. లేదంటే కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు వేసుకొని తడులు పెట్టుకొనేవారు.
1000 నుంచి 1800 అడుగుల లోతున తవ్విన బోర్లు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఒక బోరు వేయాలంటే లక్ష నుంచి రూ. 1.50 లక్షలు ఖర్చు అవుతుంది. ఐదారుబోర్లు వేసినా జల అందదు. మరికొందరు రైతులు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చుచేసి పైప్‌లైన్లు వేసుకొని మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి నీటిని చీనీతోటలకు పెట్టుకొనేవారు. ఇంకొందరు రైతులు ముందస్తుగా వర్షాకాలంలో ఫారంపాండ్ గుంతలు తవ్వుకొని అందులో నీటిని నిల్వ చేసుకొని వేసవిలో తోటలకు అందించేవారు. ఇంత చేసినా, చీనీతోటలు ఎకరాలకు ఎకరాలు రైతు కళ్లముందే ఎండిపోతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది పులివెందుల ప్రాంతాన్ని కృష్ణ జలాలు పలకరించాయి.